Breaking News

ఎక్సలెన్స్ కు ప్రతిరూపం రామోజీరావు

-ఈనాడు ఒక యూనివర్సిటీ
-పత్రికే ప్రతిపక్షంగా ప్రజావాణిని వినిపించారు
-40 ఏళ్ల పరిచయంలో ఏనాడూ చిన్న ఫేవర్ అడగని వ్యక్తి రామోజీ
-తెలుగుభాషకు చేసిన సేవలు చిరస్మరణీయం
-రామోజీ స్పూర్తితో తెలుగుభాషను సంరక్షిస్తా
-రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుజాతి గర్వించే రామోజీరావు స్పూర్తితో తెలుగు భాషను సంరక్షిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రామోజీ మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయన్నారు. రామోజీ జయంతి సందర్భంగా ఆ అక్షరయోధుడికి ఘన నివాళులర్పిస్తున్నానని అన్నారు. రామోజీ రావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్స్ లెన్స్ జాతీయ అవార్డుల ప్రదాన కార్యక్రమం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఎక్స్ లెన్స్ కి ప్రతిరూపం రామోజీరావు. సాధారణమైన వ్యక్తి అసాధారణమైన శక్తిగా తయారయ్యారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన దేన్నయినా వదులుకున్నారు. రామోజీతో నాది 40 ఏళ్ల అనుబంధం. ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన జీవితంలో ఏ వ్యక్తిని చిన్న ఫేవర్ అడగిన సందర్భం లేదు. జనహితం కోసం ఏ పార్టీ నాయకులతోనైనా నిర్మొహమాటంగా మాట్లాడేవారు. నిఖార్సయిన జర్నలిజంతో తెలుగుభాషకు ఆయన చేసిన చేవలు చిరస్మరణీయం. ఎక్కడ అవినీతి , అన్యాయం జరిగినా తన కలంతో ప్రజల పక్షాన బలంగా పోరాడారు. ప్రతిపక్షాలు లేనప్పుడు ప్రజల తరపున పనిచేసిన ఏకైక వ్యక్తి రామోజీరావు. ప్రతిపక్షం బలహీనంగా ఉంటే తానే అపోజిషన్ గా పనిచేస్తానని చెబుతుండేవారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

ఉన్నత విలువలకు నిదర్శనం ఈనాడు

ఐదు దశాబ్దాలుగా విశేష ప్రజాదరణతో ఈనాడు నడుస్తోందంటే సాధారణ విషయం కాదు. ఈనాడును ఉన్నతమైన విలువలతో రామోజీ రావు స్థాపించారు. సాధారణ వ్యక్తులకు మెరుగైన శిక్షణ ఇచ్చి జర్నలిస్టులుగా తీర్చిదిద్దారు. . మిగిలిన పత్రికల్లో పనిచేసే సిబ్బందికి ఈనాడులో చేసే వారికి తేడా ఉంటుంది. రామోజీ లాంటి వారు పదిమంది ఉంటే సమాజాన్ని మార్చడం సాధ్యమే. ఎంత ఒత్తిడి వచ్చినా విలువల విషయంలో రాజీ పడలేదు. ప్రజాహితం కోసం ప్రభుత్వాలతో పోరాడి మనుగడ సాధించారు. ఆయన నెలకొల్పిన జర్నలిజం స్కూల్లో చదువుకున్న వారు దేశ వ్యాప్తంగా అనేక పత్రికల్లో రాణించారు. 50 ఏళ్ల తర్వాత ఏం చేయాలో ఆయన ఇవాళే ఆలోచిస్తారు. ఆయన దూరదృష్టికి నిదర్శనం రామోజీ ఫిల్మ్ సిటీ. 2 వేల ఎకరాల్లో ఫిల్మ్ సిటీని అత్యద్భుతంగా నిర్మించడం గొప్ప విషయమని సీఎం అన్నారు.

తెలుగుభాషకు రామోజీ ఎనలేని సేవలు

తెలుగు భాషాభివృద్ధికి రామోజీరావు ఎంతో సేవ చేశారు. కొత్త ఇంగ్లీషు పదాలకు ప్రత్యామ్నాయంగా ఆయన ఎన్నో తెలుగు పదాలను సృష్టించారు. రామోజీ స్పూర్తితో తెలుగుభాషను పరిరక్షించేందుకు నా వంతు కృషి చేస్తాను. జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, సేవారంగం, కళలు, సంస్కృతి, యువ ఐకాన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మహిళా సాధికారతలో సేవలందించిన విశిష్ట వ్యక్తులకు రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డులు ఇవ్వడం స్పూర్తిదాయకం. ఈ రామోజీ అవార్డు భవిష్యత్తులో జ్ఞానపీఠ్, పులిట్జర్ స్థాయికి చేరుకుంటుందని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌నాయుడు, బండి సంజయ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *