Breaking News

పథకాన్ని పునరుద్ధరించి ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి… : ఎంపీ గురుమూర్తి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ పశు సంపద అభివృద్ధి మిషన్ అమలు స్థితిగతులు, తిరుపతి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందుతున్న ప్రయోజనాలపై లోక్‌సభలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానం ఇచ్చారు.

ఇప్పటి వరకు ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం రూ.113.06 కోట్ల నిధులు కేటాయించగా, అందులో రూ.53.53 కోట్ల నిధులు రాష్ట్రానికి విడుదలైనట్లు ఆయన తెలిపారు. తిరుపతి జిల్లాకు ప్రత్యేకంగా రూ.5.27 కోట్ల నిధులు కేటాయించబడినట్టు సమాధానంలో పేర్కొన్నారు.

తిరుపతి జిల్లాలో పథకం అమలు వివరాలను వెల్లడిస్తూ జిల్లాలో 15,553 పశువులకు బీమా చేసి రూ.2.89 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అలాగే రైతులకు 1,463 పశుగ్రాసం మిని కిట్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. పశుసంవర్థక రంగంలో స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి అందించే కార్యక్రమంలో భాగంగా 62 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. మొత్తంగా తిరుపతి జిల్లాలో రూ.5.89 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని మంత్రి వివరించారు.

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రయోజనాల విషయానికొస్తే, తిరుపతి జిల్లాలో జాతీయ పశు సంపద అభివృద్ధి మిషన్ కింద 36 మంది ఎస్సీలు, 29 మంది ఎస్టీలు నేరుగా లబ్ధి పొందినట్లు మంత్రి తెలిపారు. అదనంగా 1,094 మంది ఎస్సీ రైతులు, 118 మంది ఎస్టీ రైతులు పరోక్షంగా ఈ పథకం కింద ప్రయోజనం పొందినట్లు వివరించారు. ఈ పథకంలో ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ కోటా లేకపోయినా, రాష్ట్రాలు తమ షెడ్యూల్డ్ కుల, గిరిజన సబ్ ప్లాన్ నిధులను వినియోగించి ఈ వర్గాలకు మరిన్ని ప్రయోజనాలు అందించవచ్చని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

ఈ సమాదనం పై ఎంపీ గురుమూర్తి స్పందిస్తూ ఈ పథకాన్ని మళ్ళీ పునరుద్దరిస్తూ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి సబ్ ప్లాన్ నిధుల నుండి కాకుండా ఈ పథకంలోనే ప్రత్యేకంగా నిర్దిష్ట నిధులు కేటాయించే విధానాన్ని ప్రవేశపెడితే అనేక మంది పాడి రైతులకు ప్రత్యక్ష లాభం చేకూరుతుందని ఎంపీ గురుమూర్తి కేంద్ర మంత్రికి లేఖ రాశారు.

ఎస్సీ, ఎస్టీ రైతులు పశు సంపద రంగంలో ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రత్యేక జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో కోరారు. పథకం అమలు నిలిచిపోవడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎంపీ లేఖలో వివరించారు. ముఖ్యంగా పశు పోషణపై ఆధారపడిన ఎస్సీ, ఎస్టీ, సన్నకారు రైతులు, మహిళలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పథకం నిలిచిపోవడంతో రైతులు తమ పశువులకు బీమా చేసుకోలేకున్నారని, తత్ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధుల వలన చనిపోయిన పశువుల స్థానంలో, కొత్తవి కొనుగోలు చేయలేక రైతులు నష్టపోతున్నారని ఎంపీ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో పథకం అమలును వేగవంతం చేసి, రైతులకు సత్వర ప్రయోజనాలు అందేలా చూడాలని ఎంపీ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *