-పార్లమెంట్‌లో రెండు కీలక ప్రైవేట్ మెంబర్ బిల్లులు ప్రవేశపెట్టిన వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి
న్యూఢల్లీి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి శుక్రవారం పార్లమెంట్‌లో వయోవృద్ధుల గౌరవప్రద జీవనం, డిజిటల్ యుగంలో వినియోగదారుల రక్షణ కోసం రెండు కీలక ప్రైవేట్ మెంబర్ బిల్లులు ప్రవేశపెట్టారు. మారుతున్న సామాజిక, సాంకేతిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనలతో బిల్లులో పలు సవరణలు సూచించినట్లు ఎంపీ తెలిపారు.
ఈ క్రమంలో మొదటగా వినియోగదారుల రక్షణ సవరణ బిల్లు, 2025 ప్రవేశ పెట్టారు. ఆన్‌లైన్ మోసాలు, దుర్వినియోగాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారులకు తెలియకుండా అదనపు ఛార్జీలు వసూలు చేయడం, ఏఐ అల్గారిథమ్‌లతో నిర్ణయాలను ప్రభావితం చేయడం, ధరలు పెంచడం వంటి చర్యలను అన్యాయ వాణిజ్య విధానాలుగా పరిగణించాలని ప్రతిపాదించారు. అలాగే ఆన్‌లైన్ సబ్‌స్క్రిప్షన్‌ల రద్దు ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు.
అనంతరం తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంరక్షణ సవరణ బిల్లు, 2025 ప్రవేశపెట్టారు. వయోవృద్ధుల భరణంపై ఉన్న గరిష్ట పరిమితిని తొలగించడం, పిల్లల ఆదాయం, వయోవృద్ధుల అవసరాల ఆధారంగా ట్రిబ్యునల్ భరణం నిర్ణయించే అవకాశం కల్పించడం, వృద్ధులను నిర్లక్ష్యం చేస్తే ఆరు నెలల జైలు లేదా లక్ష రూపాయల జరిమానా విధించడం వంటి నిబంధనలు ఇందులో ఉన్నట్లు ఎంపీ పేర్కొన్నారు.ఈ సవరణలు వయోవృద్ధుల సంక్షేమం, డిజిటల్ వాణిజ్యంలో పారదర్శకతకు దోహదం చేస్తాయని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News