Breaking News

“జనవాణి” కార్యక్రమంలో డా. పసుపులేటి హరిప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో సోమవారం నిర్వహించిన “జనవాణి” కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు భారీగా చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ నేతృత్వం వహించారు. ఉదయం నుంచే కార్యాలయంలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని, వారి అర్జీలను స్వీకరించారు.

ఉదయం 10:00 గంటలకు ప్రారంభమైన జనవాణి కార్యక్రమం సాయంత్రం 6:30 గంటల వరకు నిరంతరంగా కొనసాగింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ వినతులు, అభ్యర్థనలు, సమస్యలను వివరంగా తెలియజేశారు. ప్రతి ఒక్కరి వినతిని శ్రద్ధగా విని, వెంటనే సంబంధిత శాఖలకు పంపించి, తదుపరి చర్యలు వేగవంతం చేసేలా అధికారులతో సమన్వయం చేయాలని హరిప్రసాద్ సూచించారు.

జనసేన పార్టీ ప్రజల సమస్యలను నేరుగా విని, వాటికి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కనుగొనే లక్ష్యంతో జనవాణి కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి అర్జీకి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, అవసరమైన చోట పార్టీ నుంచి నేరుగా ఫాలోఅప్ తీసుకుంటామని హరిప్రసాద్ స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా పార్టీకి తెలియజేయగలిగే వేదికగా జనవాణి నిలవడం గర్వకారణమన్నారు.

ఈరోజు కార్యక్రమంలో వచ్చిన అర్జీలన్నీ నమోదుకావడంతో పాటు, వెంటనే వాటిని సంబంధిత విభాగాల దృష్టికి తీసుకెళ్లే ప్రక్రియ ప్రారంభమైంది. సమస్యల పరిష్కారం సాధ్యమైనంత వేగంగా జరిగేలా సమగ్ర విధానాన్ని రూపొందించినట్లు హరిప్రసాద్ గారు వెల్లడించారు. ప్రజల నమ్మకానికి అనుగుణంగా తమ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండడమే జనసేన ధ్యేయమని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏపీఐడీసీ డైరెక్టర్ పందిటి మల్హోత్రా, వీర మహిళ ప్రాంతీయ కోఆర్డినేటర్ పాకనాటి రమాదేవి, లీగల్ సెల్ ప్రతినిధి బి. జయలక్ష్మి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *