-కాగ్నిజెంట్ సహా 9 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన
-విశాఖ ఎకనామిక్ రీజియన్ సమావేశానికి హాజరు కానున్న సీఎం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పర్యటించనున్నారు. విశాఖలోని కాపులుప్పాడ సమీపంలోని ఐటీ హిల్స్ వద్ద అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కంపెనీ నూతన భవన నిర్మాణ శంకుస్థాపన, కార్యకలాపాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రేపు ఉదయం ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తో కలిసి ఐటీ జోన్ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ సంస్థ కార్యకలాపాలను సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు. మరోవైపు ఇదే సమయంలో మంత్రి లోకేష్ ఐటీ హిల్స్ లో మరో 8 సంస్థలకు కేటాయించిన స్థలాల్లో ఒకేసారి నూతన కార్యాలయాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. టెక్ తమ్మిన, సత్వ డెవలపర్స్, ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ ఇండియా, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్ప్ టెక్నోసాఫ్ట్, ఏసీఎన్ హెల్త్ కేర్ ఆర్సీఎం సర్వీసెస్, నాన్రెల్ టెక్నాలజీస్ సంస్థలు విశాఖలో కార్యకలాపాలు త్వరలో ప్రారంభించనున్నాయి. కాగ్నిజెంట్ సహా ఈ సంస్థలు రూ.3,740 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నాయి. 41,700 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి. అనంతరం విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకూ 9 జిల్లాల సమగ్ర అభివృద్ధి రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు, లాజిస్టిక్స్ ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించనున్నారు. 9 జిల్లాల అధికారులు, మంత్రులు ప్రజాప్రతినిధులు, నిపుణులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
Prajavartha Online Telugu News