-రోడ్ల మరమ్మతులు – అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి ఆర్ & బీ శాఖ చర్యలు
-సీఎం చంద్రబాబు సూచనతో పనుల్లో వేగం పెంచేందుకు ఆర్ & బి శాఖ నిర్ణయం
-రహదారుల టెండర్లలో.. ఇకపై సింగిల్ బిడ్ కు ఆమోదం తెలిపే విధంగా వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం
-సింగిల్ బిడ్ కు ఆమోదంతో.. అనవసర జాప్యానికి ఆస్కారం లేకుండా, వేగవంతంగా రోడ్ల అభివృద్ధి పనులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన రహదారుల మరమ్మతుల పనులు చేపడుతున్నామని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో త్వరితగతిన రోడ్ల అభివృద్ధి పనులు పూర్తి చేసి, వెహికల్ మూమెంట్ తీసుకురావడమే లక్ష్యంగా ఆర్ & బీ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
ఆర్ & బి శాఖలో రహదారుల అభివృద్ధికి సంబంధించిన కాంట్రాక్ట్ పనులకు టెండర్లు పిలిచే క్రమంలో.. సాధారణంగా టెండర్లకు ఒకే బిడ్ వచ్చే సందర్భంలో.. తిరిగి టెండర్లు రీకాల్ చేయడం ఆనవాయితీ.. అయితే దీని కారణంగా తిరిగి మళ్లీ, మళ్లీ నూతనంగా టెండర్లు పిలవడం, బిడ్ లు సమర్పించడం.. వాటిని పైనల్ చేసి, ఒప్పందాలు పూర్తిచేసి పనులు చేపట్టడానికి దాదాపు 45 రోజులు పైగా సమయం పడుతోంది. దీంతో పనులు సకాలంలో ప్రారంభం కాకపోవడంతో, అధ్వాన్నంగా మారిన రోడ్లతో ప్రజలు మరింత ఎక్కువకాలం ఇబ్బందులు పడే దారుణ పరిస్థితి నెలకొంటుంది.
ఈ జాప్యాన్ని నివారించి, ప్రజా సౌకర్యార్థం, త్వరితగతిన రహదారుల మరమ్మతులు – అభివృద్ధి పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా.. ఆర్ & బీ శాఖలో తొలిసారి టెండర్లు పిలిచినప్పుడు, కేవలం ఒక్క బిడ్ మాత్రమే వచ్చినప్పటికీ.. రీ కాల్ కు ఆస్కారం లేకుండా.. దానిని పరిగణలోకి తీసుకుని, టెండర్ ఫైనల్ చేసి, పనులు ప్రారంభించేందుకు వెసులుబాటు కల్పిస్తూ, ఆర్ & బీ శాఖ నిర్ణయం తీసుకుందన్నారు.. తద్వారా అనవసర తాత్సారాన్ని నివారించడంతో పాటు, వేగవంతంగా పనులను పూర్తి చేసి, ప్రజలకు సకాలంలో మెరుగైన రహదారులు కల్పిస్తూ.. భద్రతతో కూడిన, సాఫీ ప్రయాణానికి కారణమవుతుందన్నారు..
Prajavartha Online Telugu News