-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎపీలో కోట్లాది రూపాయల అతి విలువైన భూములను కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టడంపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. ఎపిలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి కార్పొరేట్ అనుకూల పాలన సాగిస్తోంది. పెట్టుబడులను, పరిశ్రమలను ఆహ్వానిస్తున్నామనే పేరుతో రాష్ట్రంలో అతి విలువైన భూములను నామమాత్రపు ధరకే కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నది. అంతేకాకుండా ఆయా సంస్థలకు ప్రోత్సాహకాల పేరుతో భూసంతర్పణకుతోడు వనరులు, నిధులు సమకూరుస్తున్నది.
చంద్రబాబు సర్కార్ ఇప్పటికే విశాఖపట్నంలో కోట్లాది రూపాయల అతి విలువైన భూములను అదానీ గూగుల్ డేటా సెంటర్‌కు 200 ఎకరాలు, టిసిఎస్ కంపెనీకి 21.60 ఎకరాలు, కాగ్నిజెంట్‌కు 22.19 ఎకరాలు, ఇన్ఫోసిస్‌కు 20 ఎకరాలను, సత్వా గ్రూపుకు 30 ఎకరాలు, ఎఎన్‌ఎస్‌ఆర్ గ్లోబల్ కార్పొరేషన్‌కు 10.29 ఎకరాలు, సంవర్ధన సుదర్శన్ ఇంటర్నేషనల్ కంపెనీకి 3.55 ఎకరాలు, రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు 27.10 ఎకరాలు, లూలూ గ్రూపుకు 13 ఎకరాలను రూ.0.99 పైసల చొప్పున కారుచౌకగా కట్టబెట్టింది. తమ కంపెనీల ఏర్పాటు కోసం పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో భూములను వందల కోట్లకు కొనుగోలు చేసిన ఆయా కంపెనీలు ఎపీలో మాత్రం రాయితీల పేరుతో అతి తక్కువ ధరకు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలు వెలుగు చూస్తున్నాయి.
రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు విశాఖపట్నంలో అతి విలువైన 27.10 ఎకరాల భూమిని ఎకరా కేవలం రూ.0.99 పైసలకే కట్టబెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అంతేకాకుండా ప్రోత్సాహకాల పేరుతో రహేజా కంపెనీకి రూ.91.2 కోట్లను ప్రభుత్వమే ఎదురు చెల్లించేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తులు ఆహ్వానించకుండా, నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒకే కంపెనీకి భూములు ధారాదత్తం చేయడంపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడం గమనార్హం. రహేజా వంటి రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తున్నది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 18 మాసాల కాలం గడచినప్పటికీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్లస్థలాలు కేటాయింపులు ఇప్పటివరకు చేపట్టలేదు. పేదల ఇళ్ల నిర్మాణాలకు రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయాలని కోరుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఏళ్లతరబడి తమకో గూడుకోసం ఆశగా ఎదురుచూస్తున్న పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల విషయంలో తాత్సారం చేస్తున్న చంద్రబాబు సర్కార్ గుత్త పెట్టుదారీ సంస్థలకు, బడా కార్పొరేట్ శక్తులకు మాత్రం ఆగమేఘాల మీద భూ కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులివ్వడం దుర్మార్గం.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి, పాలనా పారదర్శకత ఉంటే తక్షణమే ఎపీలో కార్పొరేట్ శక్తులకు నామామాత్రపు ధరకు చేసిన భూ కేటాయింపులపై వనరులు, ప్రోత్సాహకాల పేరుతో చేసిన ప్రభుత్వ నిధుల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలను కేటాయించి, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయాలని కోరుతున్నామన్నారు.
Prajavartha Online Telugu News