– కార్యక్రమాలను సద్వినియోగం చేసుకునేలా చేయూతనివ్వండి
– ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త స్ఫూర్తితో అడుగులేయాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త స్ఫూర్తితో అందుబాటులో ఉన్న పారిశ్రామిక పథకాలు, కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకునేలా అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
శనివారం జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఇగ్నైట్ సెల్‌ను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు, చేయిపట్టి నడిపించేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలతో పాటు పీఎంఈజీపీ, పారిశ్రామిక అభివృద్ధి విధానం (2024-29), పీఎం విశ్వకర్మ యోజన, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వల్ల కలిగే ప్రయోజనాలు, ఆర్‌టీఐహెచ్ తదితరాలపై రూపొందించిన ప్రచార సామగ్రిని పరిశీలించారు. ఇగ్నైట్ సెల్‌లో ప్రదర్శించిన నాలుగు ఎంఎస్ఎంఈల ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి దార్శనికత, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా జిల్లాను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు అమలుచేస్తున్న కార్యక్రమాల్లో నిరంతర ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. పారిశ్రామిక రంగానికి సంబంధించి కీలక ప్రగతి సూచికల్లో (కేపీఐ) అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వెల్లడించారు.
కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, ఏడీ ఎస్.బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News