Breaking News

తిరుపతిలో ఐఐఎం ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రిని కోరిన ఎంపీ గురుమూర్తి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి నగరంలో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్’ (ఐఐఎం) ఏర్పాటు చేయాలని తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలను విస్తరించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా తిరుపతిలో ఐఐఎం ఏర్పాటు చేయాలని ఆ లేఖలో ఎంపీ విజ్ఞప్తి చేశారు.

ఉన్నత విద్యను బలోపేతం చేయడం, ప్రాంతీయ సమతుల్య అభివృద్ధిని సాధించడం, అలాగే సమగ్ర వృద్ధిని ప్రోత్సహించడంలో ఈ ప్రతిపాదన ఎంతో కీలకమని ఎంపీ తన లేఖలో పేర్కొన్నారు. తిరుపతిలో ఐఐఎం ఏర్పాటు చేయడం వల్ల స్థానిక విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి నాణ్యమైన మేనేజ్‌మెంట్ విద్య అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ ఇక్కడ అందుబాటులోకి రావడం వలన స్థానిక విద్యార్థులు ఉన్నత చదువుల కోసం మెట్రో నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని, తద్వారా ఇక్కడ సామాజిక పురోగతి సాధ్యమవుతుందని ఎంపీ అభిప్రాయపడ్డారు. తిరుపతి నగరం ఇప్పటికే వేగంగా అభివృద్ధి చెందుతున్న విద్యా కేంద్రంగా మారుతోందని, ఐఐఎం ఏర్పాటుకు ఇక్కడ అన్ని సానుకూల అవకాశాలు ఉన్నాయని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో తిరుపతిలో ఐఐఎం స్థాయి సంస్థ ఏర్పాటు కోసం తక్షణమే సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ గురుమూర్తి కోరారు. అలాగే, ఐఐఎం చట్టం 2017 ప్రకారం దీనిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థగా గుర్తింపు ఇవ్వాలని, గ్రామీణ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అవకాశాలు కల్పించేలా ప్రత్యేక ప్రవేశాలు, స్కాలర్‌షిప్ విధానాలు రూపొందించాలని సూచించారు. తిరుపతిలో ఐఐఎం ఏర్పాటు అయితే కేవలం ఆంధ్రప్రదేశ్‌ కాకుండా దేశానికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, ఈ విజన్‌ను సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ గురుమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *