-క్రీడల పట్ల యువత ఆసక్తి పెంచుకోవాలి.
-క్రీడల వల్ల శరీరక దృఢత్వం పాటు మానసిక స్థైర్యం పెంచుకోవడం సాధ్యం
-ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
యువతకు క్రీడా పట్ల గల ఆసక్తి కి తగిన ప్రోత్సాహం అందించాలని క్రీడల్లో గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞత యువతలో ఉండాలని, క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం పెంపొందుతుందని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. గురువారం శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో సంసద్ ఖేల్ మహోత్సవ్–2025 ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి క్రీడల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, సెలవు రోజైనప్పటికీ పెద్ద సంఖ్యలో యువత పాల్గొనడం క్రీడల పట్ల వారి ఆసక్తికి అద్దం పడుతోందని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ యువత లో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించాలనే లక్ష్యంతో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సంసద్ ఖేల్ మహోత్సవ్–2025 కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొని యువతకు సందేశాలు, సూచనలు అందించడంపై ఆ యోజన కమిటీ సమన్వయకర్త హసీనా షేక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నేటి ఆధునిక కాలంలో యువత చెడు అలవాట్ల బారిన పడటం ఆందోళన కలిగించే అంశమని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. పిల్లలను చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల వైపు దారితీయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, గురువులపై ఉందని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉంచుతూ క్రీడల ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చు కోవాలని సూచించారు.
ఇలాంటి క్రీడా కార్యక్రమాలు యువతను మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గత పది రోజులుగా క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించడంలో జిల్లా యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా క్రీడా శాఖ, పాఠశాల విద్యాశాఖల సహకారం అభినందనీ యమన్నారు. దేశ జనాభాలో 35 సంవత్సరాల లోపు యువత శాతం 65కి పైగా ఉండటం భారత దేశానికి గొప్ప బలమని, ఆ యువశక్తిని సరైన మార్గంలో నడిపిస్తే దేశం మరింత ప్రగతిపథంలో ముందుకు సాగుతుందని ఎంపీ తెలిపారు. ప్రపంచంలో నాల్గవ ఆర్థిక శక్తిగా ఎదిగిన భారతదేశం భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సభకు అధ్యక్షత వహించిన ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్ మాట్లాడుతూ, క్రీడలు ఆడటం వల్ల యువతలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక పరిపక్వత పెరుగుతుందని, ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం అలవడుతుందని తెలిపారు.
రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ, సంసద్ ఖేల్ మహోత్సవ్‌ను తొలిసారిగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహించినందుకు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి కి జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఈ క్రీడలను మరింత విస్తృత స్థాయిలో నిర్వహించాలని కోరారు.
కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, యువతలో క్రీడల పట్ల ఆసక్తిని గుర్తించి ఈ తరహా పోటీలను నిర్వహించడం అభినందనీ యమన్నారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జిల్లా క్రీడల అధికారి శేషగిరిరావు, క్రీడల నిర్వహణ ప్రతినిధి హసీనా షేక్, కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్, డీఈఓ కే. వాసుదేవరావు, సూరపు నేని చిన్ని తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News