-వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం వైద్య పరంగా అనర్హులైన APPTD ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు.
-ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
-ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు కి ప్రత్యేక ధన్యవాదాలు…రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
APSRTC నుండి ప్రభుత్వ సేవల్లోకి జనవరి 2020 లో విలీనం కాబడిన ఉద్యోగులు, వైద్యపరంగా విధులకు అనర్హులుగా ప్రకటించబడిన ప్రజా రవాణా శాఖ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి తగిన చర్యలు ప్రారంభించిందనీ, ఈ నేపథ్యంలో వికలాంగుల హక్కుల చట్టం – 2016 ప్రకారం అర్హత కలిగిన ఉద్యోగులకు ప్రాధాన్యత క్రమంలో ప్రత్యామ్నాయ ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లూ .. అవసరమైన మేరకు జిల్లా కలెక్టర్ల సహకారంతో ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా ప్రత్యామ్నాయ ఉద్యోగాల్లో నియామక అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని విజయవాడ క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటనలో మంత్రి తెలిపారు.
ఈ చట్టంలోని నిబంధనలు ప్రకారం ఆమోదించిన జాబితాలోకి రాని వైద్య కారణాల వలన అనర్హులైన ఉద్యోగులకు, RTC లో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం మానిటరీ కాంపెన్సేషన్ అందేలా చర్యలు తీసుకుంటామని, కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల సానుకూలత ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఎవరూ నష్టపోకుండా చూడటం కూటమి ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగుల జీవన భద్రత, వారి కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సానుకూల దృక్పథంతో ముందుకు రావడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Prajavartha Online Telugu News