-జనవరి 8 నుండి 10 వరకు విజయవాడ పున్నమి ఘాట్, భవానీ ఐల్యాండ్ లో నిర్వహణ.. ప్రవేశం ఉచితం
-తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు, సమకాలీన సృజనాత్మక పద్ధతులకు పెద్దపీట
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటిచెప్పేలా ప్రభుత్వం విజయవాడ వేదికగా జనవరి 8 నుండి 10 వరకు ఆవకాయ సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవం పేరిట వినూత్న సాంస్కృతిక కార్యక్రమం “ఆవకాయ” ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మరియు టీమ్‌వర్క్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో 2026 జనవరి 8 నుండి 10 వరకు మూడు రోజుల పాటు విజయవాడలోని కృష్ణా నది ఒడ్డున ఉన్న పున్నమి ఘాట్ , భవాని ఐలాండ్ లలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. రాష్ట్రంలోని సుసంపన్నమైన కథా సంప్రదాయాలు, సినిమా, సాహిత్యం, ప్రదర్శన కళలను ఘనంగా చాటాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల దార్శనికతలో భాగంగా ఈ ఉత్సవం రూపుదిద్దుకుందన్నారు. కేవలం ఇండోర్ హాల్స్‌కే పరిమితం కాకుండా, బహిరంగ ప్రదేశాల్లో ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడం దీని ప్రత్యేకత. తెలుగు కథలు, సినిమాలకు జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, అమరావతి-విజయవాడ ప్రాంతాన్ని ఒక సమకాలీన సాంస్కృతిక రాజధానిగా మార్చడమే ఈ పండుగ లక్ష్యం. ఈ ఉత్సవం ఆంధ్రప్రదేశ్ వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, స్థానిక కళాకారులకు, కళాభిమానులకు ఒక గొప్ప వేదికగా నిలుస్తుంది. సినిమా, సాహిత్యం, సంగీతం, నాటకరంగం, సాంస్కృతిక చర్చలను ఒకే బహిరంగ వేదికపైకి తెచ్చి ఆంధ్రప్రదేశ్‌ను సాంస్కృతిక మార్పిడికి, కళాత్మక భాగస్వామ్యానికి ఒక శక్తివంతమైన గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు ప్రవేశం ఉచితం.
ఈ కార్యక్రమంపై శుక్రవారం ముఖ్యమంత్రి కార్యాలయం, పర్యాటక శాఖ ఉన్నత అధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News