-‘రాష్ట్ర స్థాయి స్కిల్ కాంపిటేషన్ 2025-26’ లో 260 ప్రాజెక్టులు ప్రదర్శన
-వచ్చే ఏడాది నుంచి పదో తరగతి (SSC) బోర్డ్ పరీక్షల్లో ఒకేషనల్ సబ్జెక్టుకు స్థానం.
-అన్ని హైస్కూళ్లలో ఒకేషనల్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టేలా ప్రణాళికలు.
-నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత – కేవలం థియరీ కాదు, ప్రాక్టికల్స్‌కే పెద్దపీట.
-సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులలో కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, పని చేస్తూ నేర్చుకునే (Hands-on Learning) సంస్కృతిని పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్ర విద్యాశాఖ, సమగ్ర శిక్ష స్కిల్ ఎడ్యుకేషన్ ద్వారా కీలక మార్పులకు శ్రీకారం చుట్టిందని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు IAS., అన్నారు.
సోమవారం విజయవాడలోని మురళి రిసార్టులో ‘రాష్ట్ర స్థాయి స్కిల్ కాంపిటేషన్ 2025-26’ కార్యక్రమంలో భాగంగా 26 జిల్లాల నుండి 10 ట్రేడుల్లో 260 ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఈ కార్యమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీడీ మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానం (NEP) 2020 స్ఫూర్తితో, ఒకేషనల్ ఎడ్యుకేషన్‌ను కేవలం ఒక అదనపు సబ్జెక్టుగా కాకుండా, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు ప్రాధాన్యత
ప్రస్తుతం బట్టీ పద్ధతిని వీడాల్సిన అవసరం ఉందని, ఫిన్లాండ్ వంటి దేశాల తరహాలో మన దగ్గర కూడా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌ను ప్రోత్సహిస్తున్నామన్నారు. కేవలం మార్కుల కోసమే కాకుండా, దైనందిన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు.. టాప్ లీకేజీ అరికట్టడం, సైకిల్ పంచర్ వేయడం వంటివి పరిష్కరించుకోగల నైపుణ్యాన్ని హైస్కూల్ దశలోనే విద్యార్థులకు అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుండి పదో తరగతి (SSC) మార్కుల జాబితాలో ఒకేషనల్ సబ్జెక్టు మార్కులను కూడా చేర్చనున్నామని, ఇది విద్యార్థుల గ్రేడింగ్‌లో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అదే విధంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హైస్కూళ్లలో ఒకేషనల్ ఎడ్యుకేషన్‌ను ప్రవేశపెట్టేందుకు బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఒకేషనల్ ట్రైనర్ల ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), మెరిట్ ప్రాతిపదికన మాత్రమే జరుగుతుందన్నారు.
వృత్తి విద్యపై అపోహలు వద్దు – ఇన్నోవేటర్లుగా ఎదగాలి
ఒకేషనల్ విద్య అంటే పిల్లలను కేవలం కూలీలుగా మార్చడం కాదని, వారిని రేపటితరం ఆటోమొబైల్ ఇంజనీర్లుగా, ఇన్నోవేటర్లుగా తీర్చిదిద్దడమేనని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, టీచర్లు, హెడ్ మాస్టర్లు దీనిపై అవగాహన పెంచుకోవాలని కోరారు.
ప్రాజెక్టులో గెలుపొందిన విజేతలకు ట్రేడుల వారీగా ప్రథమ బహుమతి రూ. 25వేలు, ద్వితీయ బహుమతి రూ. 15 వేలు, తృతీయ బహుమతి రూ. 10 వేలు చొప్పున నగదు బహుమతితో పాటు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
ర్యాంప్ వాక్… అదరహో
వృత్తి విద్యా కోర్సులో భాగంగా ‘అప్పారెల్, మేడ్-అప్స్ అండ్ హోమ్ ఫర్నిషింగ్ కోర్సులో భాగంగా వస్త్ర తయారీ, కుట్టు శిక్షణ, గృహ అలంకరణ సామగ్రి అంశాల్లో శిక్షణ పొందిన విద్యార్థులు తామే స్వయంగా కుట్టుకున్న వస్త్రాలు ధరించి ర్యాంప్ వాక్ చేసి, అందరినీ ఆకర్షితులను చేశారు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏఎస్పీడీలు డా. ఎం.ఆర్.ప్రసన్నకుమార్, కె.రవీంద్రనాథ్ రెడ్డి, స్యీమాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డా. కె.వి.శ్రీనివాసులురెడ్డి, స్టేట్ ఫైనాన్స్ కంట్రోలర్ రాజగోపాల్, కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు, ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ, కృష్ణా జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ కుముదిని, స్టేట్ జీసీడీవో విఎస్ఎన్ మూర్తి, జిల్లా జీసీడీవోలు, ఒకేషనల్ కోఆర్డినేటర్లు, ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News