-పి.బి. సిద్ధార్థలో సునీల్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృత్రిమమేధను వాడుకునే క్రమంలో ఆ నూతన సాంకేతికత వల్ల మానవమేధ మందకొడిగా మారకుండా అప్రమత్తం కావాలని ఆరిగో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (బెంగళూరు) వైస్ ప్రెసిడెంట్ డా. ఉప్పల సునీల్ కుమార్ అన్నారు. మంగళవారం విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిణామాలపై ఆయన మాట్లాడుతూ ఎ.ఐ. అప్లికేషన్లపై అతిగా ఆధారపడకుండా జాగ్రత్త వహించాలని, విద్యార్థులు తమ సృజనాత్మక, విమర్శనాత్మక ఆలోచనా సామర్థ్యాలను కాపాడుకోవాలన్నారు. ప్రస్తుతం ప్రపంచం ఆర్టిఫిషియల్ నేరో ఇంటెలిజెన్స్ నుండి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్‌కు మారుతోందని, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్‌ను సాధించడానికి మరింత సమయం పడుతుందన్నారు. డిజిటల్ గోప్యత, డేటా రక్షణ చట్టాలను నవీకరించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు ప్రాజెక్ట్ ఆధారిత సాంకేతిక అభ్యాసం, లాజికల్, డీబగ్గింగ్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్నారు. ప్రిన్సిపల్ డా. మేకా రమేశ్, డీన్ ఆచార్య రాజేశ్ సి. జంపాల ఈ సందర్భంగా సునీల్ కుమార్ ను సత్కరించారు.
Prajavartha Online Telugu News