Breaking News

ప్రజా ఉద్యమాలపై కేంద్రం కుట్ర

-ఐక్యంగా తిప్పికొడదాం
-సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
-కమ్యూనిజం అజరామరం
-జనవరి 18న ఎర్ర సముద్రంలా ఖమ్మం
-సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
-ఖమ్మం సభకు ఏపీ నుంచి 50 వేల మంది
-జనవరి 10, 11, 12 లలో ఎపీ వ్యాప్తంగా సిపిఐ జాతాలు
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్రజాతంత్రవాదులను, ప్రజాతంత్ర సంస్థలను, ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు కుట్రలు పన్నుతున్నదని, దానిని ప్రజాస్వామిక వాదులందరూ ఏకోన్ముకంగా తిప్పికొట్టాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో ప్రజా సమస్యలపై సమ్మెలు, పోరాటాలు దేశంలో ఎక్కడా జరగకూడదనే కుతంత్రాలకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఒడిగడుతోందని ధ్వజమెత్తారు.
విజయవాడ దాసరిభవన్‌లో మంగళవారం సిపిఐ తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎపి రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావులతో కలిసి రామకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో అవలంభిస్తున్న పద్ధతుల్ని రాష్ట్రంలోను అవలభించే తరహాగా, ఈనెల 29వ తేదీన జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలోను సీఎం చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోందన్నారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను డబుల్‌ ఇంజన్‌ కూటమి సర్కారు ఉందని, దీంతో కేంద్రంలో అమలు చేస్తున్న విధానాల్నే రాష్ట్రంలోను అమలుకు పూనుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికే దీనిని ప్రారంభించారని, ఇందుకు ఉదాహరణగా అనకాపల్లి జిల్లా సిపిఎం నాయకులు అప్పలరాజుపై పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించి అరెస్టు చేసి, విశాఖ సెంట్రల్‌ జైలుకు పంపారన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన బైజూస్‌కు వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలో భాగంగా ఏఐఎస్‌ఎఫ్‌, ఎఐవైఎఫ్‌ నేతలను ఇప్పుడు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు జరగనీయకుండా ఉంచేలా పాలకులు ఈ తరహా చర్యల్ని చేపడుతున్నారని తీవ్రంగా ఖండిరచారు. రాష్ట్రంలో పిపిపి పద్ధతిలో వైద్య కళాశాలలకు వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయని, ఇప్పటికైనా పిపిపి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించాలని డిమాండ్‌ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి గాంధీజీ పేరు తొలగించి, ఆ పథకంలో సవరణలు చేయడంతో గ్రామీణ ప్రాంత పేదల ప్రజలకు అన్యాయం వాటిల్లుతుందని తెలిపారు. ప్రధానంగా చేతివృత్తిదారులు ఉపాధిని కోల్పోయే ప్రమాదముందని, వారి జీవన విధానం దెబ్బతింటుందని చెప్పారు. వాటన్నిటిపైనా చర్చించేందుకుగాను జనవరి 19, 20, 21 తేదీల్లో తెలంగాణా రాష్ట్రం, ఖమ్మం నగరంలో సిపిఐ జాతీయ కార్యవర్గ, సమితి సమావేశాలు జరగనున్నాయని వెల్లడిరచారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈనెల 26వ తేదీన సిపిఐ శత వార్షికోత్సవాలను దేశ వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించి, ఎర్ర జెండాలను రెపరెపలాడిరచినట్లు తెలిపారు.
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ వందేళ్ల చరిత్ర గల సిపిఐ నిత్యం పేద, శ్రామిక వర్గాల ప్రజల కోసం ఉద్యమిస్తోందన్నారు. స్వాతంత్రోద్యమంలో భారత కమ్యూనిస్టు పార్టీతోపాటు కాంగ్రెస్‌ మాత్రమేనన్నారు. సిపిఐ 1925లో ఆవిర్భవించి ఒక్క శక్తిగా శ్రామిక, పేద వర్గాల తరపున పోరాడుతోందని వివరించారు. వందేళ్ల కమ్యూనిస్టు పార్టీ దేశంలో ఉండటమనేది చిన్న విషయం కాదని తెలిపారు. కమ్యూనిస్టులు అధికారం ఉన్నా, లేకపోయినా ఒకే తరహాగా ఉద్యమబాట కొనసాగిస్తున్నారని తెలిపారు. నాడు తెలంగాణ సాయుధ పోరాటంలోను కమ్యూనిస్టులు ప్రధాన భూమిక పోషించారని గుర్తుచేశారు. దేశంలో నలుమూలలా ఉన్న ఏకైక పార్టీ సిపిఐ అని, అంత ఘనమైన చరిత్రగల సిపిఐ శత వార్షికోవాల ముగింపు వేడుకలు జనవరి 18న తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం గడ్డపై జరుగనున్నాయన్నారు. ఈ శత వార్షికోత్సవ ముగింపు వేడుకల సందర్భంగా జరిగే ప్రదర్శన, బహిరంగసభలకు దేశ నలుమూలల నుండి 5 లక్షల మంది పార్టీ శ్రేణులు తరలిరానున్నారని తెలిపారు. మరో 40 దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని, ఖమ్మం ఎర్ర సముద్రంలా మారనుందని చెప్పారు. కమ్యూనిజం అనేదీ అజరామన్నారు. దేశంలో నేడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ప్రశ్నించే వారిని అణచివేసే చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో నక్సల్స్‌ను చంపడం, విశాఖ ఉక్కు ప్రైవేట్‌కు కట్టబెట్టడం, పిపిపి విధానంలో వైద్యకళాశాలలు కార్పొరేట్‌కు ధారాదత్తం లాంటి చర్యలకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఒడిగట్టడం దుర్మార్గమన్నారు. సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌లు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను బిజెపికి కొమ్ముకాస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో రెండే ఐడియాలజీలు ఉన్నాయని, ఒకటి పెట్టుబడిదారీదికాగా, మరొకటి సోషలిజం ఐడియాలజీ అని తెలిపారు. పెట్టుబడిదారి వ్యవస్థను కార్మిక, పేదల పక్షాన ఒక్క కమ్యూనిస్టు పార్టీకే ప్రశ్నించే సత్తా ఉందని స్పష్టంచేశారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ వందేళ్ల కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం, దాని పోరాటం, త్యాగం, సాధించిన లక్ష్యాలను వివరించేందుకుగాను ఖమ్మం గడ్డంపై జరగబోయే శత వార్షికోత్సవ ముగింపు సభ ఒక చారిత్రాత్మకంగా నిలవనుందని తెలిపారు. దీనికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 50 వేల మంది తరలివెళ్లనున్నట్లు ప్రకటించారు. కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులందరికీ ఖమ్మం సభ ఒక జవాబు చెప్పనుందన్నారు. దోపిడీ వ్యవస్థ ఉన్నంత వరకు ఎర్రజెండా ఎగురుతూనే ఉంటుందని వెల్లడిరచారు. సిపిఐ శతవార్షికోత్సవ ముగింపు ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ జనవరి 10, 11, 12 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోను జీపు జాతాలు, మోటారు సైకిల్‌ జాతాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌ రాజ్యాంగ హక్కులు హరించే కార్యక్రమాలకు ఒడిగడుతున్నారని తూర్పారబట్టారు. పిపిపి విధానంలో 17 ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేట్‌కు ధారాదత్తం చేస్తుంటే.. దానిపై సీఎం చంద్రబాబు తగ్గేదీ లేదంటూ సినిమా డైలాగ్‌లు వేస్తున్నారని మండిపడ్డారు. అదే తరహాగా ఉంటే రాబోయే 2029లో చంద్రబాబును ప్రజలే తగ్గిస్తారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఉన్నత వర్గాలలోని పేదలుగా ఉన్న ప్రతిభగల విద్యార్థులకు అన్యాయం చేయడం, రాజ్యాంగ బద్ధంగా రావాలిసిన ఉద్యోగాలను ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు పిపిపి ద్వారా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. స్థానిక ఎన్నికలకు వెళ్లే ముందు జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే తెలంగాణలో ఆ ప్రక్రియ ప్రారంభమైందని, ఎపీలో స్థానిక ఎన్నికలకంటే ముందుగానే జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ పరిపాలన రావాలంటూ పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించడం సిగ్గుచేటని, దేశంలోని అన్ని రాష్ట్రాలలో కంటే అక్కడ 8.9 క్రైమ్‌ రేటు అధికంగా ఉందని, అక్కడ ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగుతున్నాయని, అలాంటి పరిపాలన ఏపీకి రావాలా? అంటూ ప్రశ్నించారు. అంటే రాష్ట్రంలోని సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత పరిపాలనపై మీకు నమ్మకం లేదా? అని పవన్‌ను సూటిగా ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక తరహాగా, అధికార పగ్గాలు చేపట్టాక మరోలా చంద్రబాబు నియంతలా వ్యాఖ్యానించడం తగదని, నియంతలకు రాజ్యాధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తెరగాలని సూచించారు. పాలకులు ఇదే తరహాగా ఉంటే భవిష్యత్తులో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ పోరాటాలు మరింత ఉధృతమవుతాయని నొక్కిచెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *