విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జి. కోటేశ్వరరావు అధ్యక్షతన విజయవాడ దాసరి భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొని జాతీయ రాజకీయ పరిణామాలను గురించి వివరించారు. ఎపి రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కర్తవ్యాలను గురించి వివరించారు. తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ 2026 జనవరి 18న ఖమ్మంలో జరుగనున్న సిపిఐ 100 ఏళ్ల ముగింపు ఉత్సవాలకు పార్టీ శ్రేణులు, ప్రజానీకం పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పాల్గొన్నారు. సమావేశం ఈ దిగువ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.
తీర్మానం
ప్రజా ఉద్యమాలపై అణచివేత చర్యలను తక్షణమే ఆపివేయాలి
మనదేశంలో 1974 తర్వాత జరిగిన ప్రజా ఆందోళనలపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం చాలా తీవ్రమైన అంశం. తద్వారా భవిష్యత్‌లో నిరసనలు, ఆందోళనలకు దిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావించిన వారినందరిని కుట్రదారుల పేరున ముందుగానే అణచివేయడానికి కేంద్రంలోని బిజెపి కుయుక్తులు పన్నుతున్నది. ఈ పేరున ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు ఒక సమగ్ర కార్యచరణను రూపొందించడంలో భాగమే ఈ నిర్ణయంగా స్పష్టమవుతున్నది.
ఈ మేరకు గత 50 ఏళ్లలో దేశంలో జరిగిన ప్రజాందోళనలు, నిరసనలపై ఒక ప్రామాణిక కార్యచరణ విధానాన్ని (ఎస్‌వోపీ) సిద్ధం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నాలుగు నెలల క్రితం బ్యూరో ఆఫ్ పోలీస్ అండ్ డెవలప్మెంట్ (బీపీఆర్ అండ్ డీ)ని ఆదేశించడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా వ్యతిరేకస్తున్నది. ఆయా ఉద్యమాల స్వభావాన్ని తెలుసుకునేందుకే ఈ ఆదేశాలంటూ కేంద్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నప్పటికీ, ఇందులో తమ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక ధోరణిని, ప్రభుత్వ ప్రాయోజత కార్పొరేటీకరణ విధానాలను ప్రశ్నించే, నిలదీసే శక్తులను నిలువరించడమనే కుట్ర ఇందులో దాగిఉన్నది.
కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని పోలీసు వ్యవస్థ 13 ప్రశ్నలతో రూపొందించిన ఒక ప్రశ్నావళిని చుస్తే భవిష్యత్‌లో ప్రజా ఉద్యమాలే లేకుండా చేసి తమకు ఎదురులేదని నిరూపించుకునే కుట్రపూరిత ఆలోచన కనిపిస్తున్నది. కేంద్రం ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలైన వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఈ కుట్రపూరిత ఆలోచనల అమలుకు పూనుకున్నాయి.
మన రాష్ట్రంలోని కూటమి పాలనలోనూ ఈ దశ ప్రారంభమైనది. ఇందుకు ఇటీవలే అనకాపల్లి జిల్లా సిపిఎం నేత అప్పలరాజుపై మోపిన పిడి యాక్ట్ ఒక ఉదాహరణ. మన పార్టీ, ప్రజాసంఘాలపైన ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి. రెండేళ్ల కిందట విశాఖపట్నంలో చోటుచేసుకున్న బైజూస్ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థి, యువజన ఉద్యమకారులపై ప్రభుత్వం ఇటీవల అత్యంత క్రూరంగా వ్యవహరించింది. విద్యార్థుల సంక్షేమం కోసం ఆ ఆందోళన జరిగిందని గుర్తించకుండా ఆ ఆందోళనలో పాల్గొన్న నేతలపై రౌడీషీట్ తెరచి కూటమి ప్రభుత్వం తమ నిజస్వరూపాన్ని బహిర్గతం చేసుకున్నది.
భారత రాజ్యాంగంలో ప్రతి మనిషికి కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది భావ ప్రకటన స్వేచ్ఛ. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1)ఎ ప్రకారం దేశ పౌరులందరికి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ లభిస్తుంది. రాజ్యాంగబద్ధమైన ఈ హక్కు ద్వారా పౌరులు ప్రభుత్వంపై విమర్శలు చేయడం, అభిప్రాయాలు చెప్పడం, నిరసన వంటి వాటికి అవకాశం ఉన్నది. భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ఈ హక్కుని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అపహాస్యం చేసేలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఇది పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అవుతుంది.
దేశంలో ఎక్కడా ప్రజా ఉద్యమాలు, ఆందోళనలు జరగకూడదనే పద్ధతుల్లో ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ చర్యలను భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యలను విడనాడాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమాలు తీవ్రతరమవుతాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టంచేస్తూ సిపిఐ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం తీర్మానిస్తున్నదన్నారు.
Prajavartha Online Telugu News