విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వార్షిక నేర గణాంకాలను ఎన్టీఆర్ పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో విడుదల చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృ తంగా వినియోగించడం ద్వారా తగ్గించగలిగామని సీపీ వివరించారు. ఈ ఏడాది ఎన్టీఆర్ కమిషనరే ట్లో నేరాల సంఖ్య తగ్గింది.. గత సంవత్సరంతో పోలిస్తే 2025లో 21.66 శాతం తక్కువ నమోదైంది. గతేడాది మొత్తం 11,977 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 9,503 కేసులే రిజిస్టర్ అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే.. ప్రాపర్టీ నేరాలు 39.83 శాతం తగ్గాయి. భౌతిక దాడులు.. 12. 53 శాతం, మహిళలపై నేరాలు.. 15.11 శాతం, పోక్సో కేసులు.. 23.64 శాతం, రోడ్డు ప్రమాదాలు.. 23.39 శాతం, సైబర్ నేరాలు 45.05 శాతం మేర తగ్గాయి. ఆర్ధిక నేరాలు 12.68 శాతం, నార్కోటిక్స్ కేసులు 19. 57 శాతం పెరిగాయి.
నేరం చేసిన నిందితులకు శిక్షలు పడే శాతంలో గణనీయమైన మెరుగుదల నమోదైంది. ప్రతి రెండో కేసులో శిక్ష పడుతోంది. 2024లో మొత్తం 1,395 శిక్షలు పడ్డాయి. శిక్షల శాతం 37 శాతం ఉంది. 2025లో గణాంకాలు మెరుగ య్యాయి. 2,123 శిక్షలు పడ్డాయి. దీంతో శిక్షల శాతం 50కు పెరిగింది. యావజ్జీవ, మరణించే వరకు శిక్షలు తొమ్మిది కేసుల్లో పడ్డాయి. పదేళ్లు అంతకంటే ఎక్కువ.. 18 కేసుల్లో, 3 నుంచి 7 ఏళ్లు.. 27 కేసుల్లో శిక్షలు పడ్డాయి. రోడ్డు ప్రమాదాల్లో గుర్తు తెలియని వాహనాలు ఢీకొని చనిపోయిన, గాయపడిన కుటుంబాలకు పరిహారం మంజూరులో కమిషనరేట్ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.
మొత్తం 328కు గాను 238 కేసుల్లో రూ.2కోట్ల మేర పరిహారం మంజూరైంది. ‘డ్రోన్ కమాండ్ కంట్రోల్ సెంటర్’ అనే డ్యాష్ బోర్డు ను కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు అభివృద్ధి చేశారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని డ్రోన్లను దీని ద్వారా పర్యవేక్షణకు వీలవుతుంది. ఇవి చిత్రీకరించే దృశ్యాలనూ వీక్షించేందుకు అవకాశం కలిగింది. ఇటువంటి వినూత్న సాంకేతిక ఆవిష్కరణల కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఒప్పందం చేసుకున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్షిప్ కార్యక్ర మాన్ని కూడా చేపట్టారు. తద్వారా వీరి సృజనను వివిధ అవసరాలకు వినియోగించుకునేందుకు వీలు కలుగుతోంది.
దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలలో చరిత్రలో నిలిచే భద్రత దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలను పోలీసు శాఖ అత్యంత విజయవంతంగా నిర్వహించింది. మావోయిస్టు కార్యకలాపాలపై ప్రత్యేక దాడులు నిర్వహించి, ప్రమాదకర ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకొని, నగర శాంతి భద్రతలకు ముప్పుగా మారిన నెట్వర్క్ ను పూర్తిగా ఛేదించారు. అంతర్రాష్ట్రంగా సాగుతున్న బాలల అక్రమ రవాణా ముఠాను గుర్తించి, పది మంది నిందితులను అరెస్టు చేసి, బాధిత పిల్లలను సురక్షితంగా రక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News