– కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగులు
– అందరి సహకారంతో 2026లోనూ జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం
– 18.5 శాతం వార్షిక వృద్ధికి సమష్టిగా కృషిచేస్తున్నాం
– అన్ని రంగాల్లోనూ సమగ్రాభివృద్ధికి దార్శనిక ప్రణాళికలు
– జీడీడీపీ, తలసరి ఆదాయ లక్ష్యాలను చేరుకుంటున్నాం
– వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర దిశగా కార్యాచరణ
– గౌరవ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో నియోజకవర్గాల అభివృద్ధి
– నిర్మాణాత్మక సద్విమర్శలకు ఎప్పుడూ ఆహ్వానం
– గౌరవ సీఎం దిశానిర్దేశంతో ఆధునిక సాంకేతిక, రియల్ టైమ్ గవర్నెన్స్‌తో అనుసంధానం
– ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏడాది కాలంలో మీడియాతో సహా వివిధ భాగస్వామ్య పక్షాలు, అధికారులు, గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో సమష్టి కృషితో ఎన్నో విజయాలు సాధించామని.. జిల్లా అభివృద్ధి దిశగా కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగులు వేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. గతంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సమగ్రాభివృద్ధికి దారితీసే ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందరి సహకారంతో 2026లోనూ జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేస్తామన్నారు.
బుధవారం విజయవాడ గురునానక్ కాలనీ రోడ్డు శుభలగ్న వేదిక ఫంక్షన్ హాల్‌లో మీడియా ప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా అన్ని రంగాల్లోనూ 18.5 శాతం వార్షిక వృద్ధి లక్ష్యంగా పటిష్ట ప్రణాళికలు అమలుచేస్తున్నామన్నారు. వివిధ శాఖలకు సంబంధించి 315 కీలక ప్రగతి సూచిక (కేపీఐ)ల్లో 83 స్కోరుతో రాష్ట్రంలోనే నెం.1గా జిల్లా నిలిచిందని.. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తూ ప్రతి సూచికలోనూ ముందంజలో నిలిచేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. 2023-24లో తలసరి ఆదాయం రూ. 3,21,651 కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సర లక్ష్యం రూ. 4,17,412 అని, లక్ష్యాలకు అనుగుణంగా ప్రగతి దిశగా పయనిస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
ప్రతి నియోజకవర్గానికి దార్శనిక ప్రణాళికలు:
గౌరవ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రతి నియోజకవర్గ అభివృద్ధిపై దార్శనిక ప్రణాళికల(Vision Plans)తో ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని.. స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఎ.కొండూరుకు అదనపు డయాలసిస్ కేంద్రం రావడాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చన్నారు. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు స్థానికంగా ఉపాధి కల్పనకు, ఆర్థిక వృద్దికి ఊతమిచ్చే విధంగా ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే మూడు నియోజకవర్గాల్లో పనులు ప్రారంభమయ్యాయన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేశామని.. రెండు ప్రపంచ రికార్డులు కూడా సొంతం చేసుకున్నామన్నారు. రికార్డు స్థాయిలో భక్తులతో పాటు కృష్ణమ్మకు భారీగా వరద ప్రవాహం వచ్చినా ఎక్కడా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు.
లోటుపాట్లను సరిదిద్దుకుంటూ..:
నిర్మాణాత్మక సద్విమర్శలను స్వీకరించి లోటుపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఒక్క పారిశ్రామిక రంగంలోనే కాకుండా అన్నింటా ఈజ్ ఆఫ్ డూయింగ్‌తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్‌కు ప్రాధాన్యమిస్తూ సత్వర ప్రగతికి టీమ్ ఎన్‌టీఆర్ కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ, పారిశ్రామికరంగాలతో పోల్చితే జిల్లాలో సేవారంగం అధిక శాతం వాటా (దాదాపు 67 శాతం) కలిగి ఉందని.. ఈ రంగంలో మరింత అభివృద్ధికి ఆస్కారముందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆంధ్రా ట్యాక్సీ యాప్‌తో పాటు ప్రత్యేక టూరిజం ప్యాకేజీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఆధునిక సాంకేతికత, డేటా లేక్ సహాయంతో ముందుకెళ్తున్నామన్నారు. మొంథా తుపాను సమయంలో డేటా అనలిటిక్స్ సహాయంతో తీసుకున్న చర్యలు మంచి ఫలితాలిచ్చాయన్నారు. పరిపాలనలోనూ రియల్‌టైమ్ గవర్నెన్స్, డేటా బ్యాంకు సహకారంతో ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సంక్షేమ అభివృద్ది పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ అంటే కేవలం ఎన్‌టీఆర్ జిల్లా ప్రధాన కేంద్రం మాత్రమే కాదని.. అమరావతి ప్రాంతానికి గేట్ వే అని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, మీడియా సహకారంతో ముందుకెళ్తామని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
కార్యక్రమంలో డీఐపీఆర్‌వో కేవీ రమణరావు, డివిజనల్ పీఆర్‌వో కె.రవి, ఆడియో విజువల్ సూపర్‌వైజర్ వీవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News