-ముఖ్యమంత్రికి ధన్యవాదాలు: రైల్వే కోడూరు ఏం.ఎల్. ఏ ఆరవ శ్రీధర్
-మరింత వేగవంతంగా, ప్రజలకు సులభంగా సేవలు అందించేలా అధికారులు పని చేయాలి.
-ఈ-ఆఫీస్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలి
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
రైల్వే కోడూరు, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా పునర్విభజన అనంతరం పరిపాలన వ్యవస్థ మరింత వేగవంతంగా, ప్రజలకు సులభంగా సేవలు అందించేలా పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు.
బుధవారం సాయంత్రం తిరుపతి జిల్లాలో కలిసిన రైల్వే కోడూరు నియోజకవర్గం, కోడూరు తహసీల్దారు కార్యాలయాన్ని ఎంఎల్ఏ అరవ శ్రీధర్ తో కలిసి సందర్శించారు. మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మీడియాతో రైల్వే కోడూరు శాసన సభ్యులు అరవ శ్రీధర్ మాట్లాడుతూ…రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొనెదల పవన్ కళ్యాణ్ సూచనలు, ఆదేశాలు మరియు ప్రజల ఆకాంక్ష మేరకు అన్నమయ్య జిల్లా (రాయచోటి) నుంచి రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో కలపడంతో రైల్వే కోడూరు ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.ప్రజల నుండి వచ్చిన అభ్యర్థనల మేరకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ సీఎం కమిటీ వేసి ఆ కమిటీ ప్రకారమే మన రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో కలపడం జరిగిందన్నారు.ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఈరోజు-తిరుపతి జిల్లా కలెక్టర్ ఇక్కడికి వచ్చారన్నారు. రైల్వే కోడూరులో డెవలప్మెంట్ చేయవలసిన అంశాలను జిల్లా కలెక్టర్ తో చర్చించిరైల్వే కోడూరుని డెవలప్మెంట్ దిశగా తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు మన రైల్వే కోడూరుని జత చేసినందుకు సీఎం, డిప్యూటీ సీఎం లకు మరొకసారి పాదాభి వందనం చేసుకుంటునాన్నని కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనను పూర్తి చేసి ఈ రోజు నుంచి రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పూర్తిగా ఐదు మండలాలు తిరుపతి జిల్లాలో కలపడం జరిగిందని ఈ మేరకు నిన్న రాత్రి ప్రభుత్వం గెజెట్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఇందుకు అనుగుణంగానే ఈ నియోజక వర్గంలో సుమారుగా ఉన్న 76 సచివాలయాలలో ఉన్న అధికారులకు , ఇతర అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు జిల్లా పేరును తిరుపతిగా మార్చాలని అలాగే ఈ మండలాలు తిరుపతి డివిజన్ క్రిందకు వస్తాయని సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. పరిపాలన పరంగా వీటికి సంబంధించిన రికార్డులను తిరుపతి జిల్లాలోని సంబంధి శాఖల అధికారులకు అప్పగించేందుకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.ఈ రోజు నుంచే పూర్తిగా మొత్తం యంత్రాంగం కూడా రైల్వే కోడూరుకు సంబంధించి పనులు స్టార్ట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఈ ఐదు మండలాలు కూడా తిరుపతి జిల్లాకు రావటం,అదేవిధంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎన్నో సంవత్సరాల ప్రజల ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి సలహాలు సూచనల మేరకు ఈ నియోజకవర్గం అంతా తిరుపతి జిల్లాకు రావడం ప్రజలందరూ కూడా ఇక్కడ చాలా సంతోషం వ్యక్తం చేశారని అన్నారు. నూతనంగా ఈ మండలాలు తిరుపతిలో కలవడంతో పరిపాలన పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడి శాసన సభ్యులతో,అధికారులతో ,ప్రజాప్రతినిధులతో సమన్వయ పరుచుకుంటూ సమస్యలు లేకుండా ఉండేందుకు అధికారులకు సూచించామన్నారు.అలాగే నియోజకవర్గంలోనీ సమస్యలపై శాసన సభ్యులతో చర్చించడం జరిగిందని, ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సమస్యలు, ఇతర సమస్యలు చేయలవలసిన అభివృద్ధి పనులపై తెలుసుకోవడం జరిగిందన్నారు.
రేణుగుంట – కడప నేషనల్ హైవే కు సంబంధించి ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చిందని వచ్చే రెండు మూడు నెలల్లోనే ఆ పనులు కూడా స్టార్ట్ చేసుకోబోతున్నామన్నారు. ఈ పనులు పూర్తయితే తిరుపతి జిల్లాకి ఇంకా ట్రావెల్ టైం కూడా తగ్గబోతుందన్నారు. తిరుపతి జిల్లాలో ఇప్పటికే సుమారుగా 38% ఫారెస్ట్ కవరై ఉందని ఈ నియోజకవర్గం చేరటంతోటి తిరుపతి జిల్లా ఫారెస్ట్ కవర్ సుమారుగా 40% దాటుతుందని దీనితో రాష్ట్రంలో స్టేట్ రెండవ హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ జిల్లాగా ఉంటుందన్నారు. కానీ దానితో పాటు వచ్చే సమస్యలు కూడా మనకు ఉన్నాయనీ వాటన్నిటినీ కూడా మనము అతి త్వరలోనే పరిష్కారం చేసుకుంటామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రైల్వే కోడూరు లో వెనకబడిన మండలాలు అయిన పెనగలూరు , చిట్వేల్ , పుల్లంపేట ఓబులవారిపల్లి , రైల్వే కోడూరు లలో ఉన్న సమస్యలన్నీ ముందున్న అధికారులు, శాసన సభ్యులతో సుదీర్ఘంగా కూడా చర్చించడం జరిగిందిని , ఇక్కడ ఉన్న భూ సమస్యలు అటవీ సమస్యలు, రోడ్డు సమస్యలు, పంచాయతీ సమస్యలు అతి త్వరలో పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. శాసనసభ్యులు, జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకవైపు సంక్షేమం ,మరోవైపు అభివృద్ధి సమపాళ్లలో చేసేవిధంగా కూడా చర్యలు తీసుకుంటామని మరొకసారి మీడియా మిత్రుల ద్వారా అందరికీ జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తున్నానన్నారు. అందరి ప్రజలకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాల బౌండరీలు మాత్రమే మారాయని, ప్రభుత్వ పరిపాలనా విధానం, ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, ఉప ముఖ్యమంత్రి గారి మార్గదర్శకాలు యథాతథంగా కొనసాగుతాయన్నారు.జిల్లాల పునర్విభజన వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ప్రజలకు దగ్గరగా, వేగంగా పరిపాలన అందించడమేనని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను వెంటనే సంబంధిత మండల, డివిజన్, కలెక్టరేట్ కార్యాలయాలకు తరలించి, అవసరమైన చర్యలు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇతర జిల్లాల నుంచి ఫైళ్లు రావడానికి ఎదురుచూడకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ఈ-ఆఫీస్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, అనవసర ప్రయాణాలు తగ్గించుకుని సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఆర్డీఓలు, తహసీల్దార్లు ఈ-ఆఫీస్‌లో పని ప్రారంభించారని గుర్తు చేశారు. అన్ని ప్రభుత్వ భవనాల్లో జిల్లా పేరు మార్పును వెంటనే చేపట్టి, ప్రజలకు కొత్త పరిపాలనా వ్యవస్థ స్పష్టంగా తెలియజేయాలన్నారు.అత్యవసర సమస్యలు ఏవైనా ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కారం చేస్తామని తెలిపారు. జిల్లా పునర్విభజన వల్ల ప్రజలకు పరిపాలన మరింత సులభమైందని పనితీరుతో నిరూపించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అందరూ సమిష్టిగా పనిచేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.అధికారులందరికీ ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వారం రోజులలోపే పరిపాలన పూర్తిగా గాడిలో పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్ డి ఓ రామ్మోహన్, రైల్వే కోడూరు మండల కేంద్ర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News