Breaking News

గిరిజన మహిళలకు పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర కానుక

-సికిల్ సెల్ ఎనేమియా బాధితుల కోసం అరకులో బ్లడ్ బ్యాంకు
-పవన్ కళ్యాణ్ చొరవతో… దాతల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా బ్లడ్ బ్యాంక్ భవనం నిర్మాణం
-కురిడీ మాటా మంతిలో సమస్యను ఉపముఖ్యమంత్రి కి వివరించిన గిరిజన మహిళ
-వైద్య నిపుణుల సూచనలతో బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు సన్నద్ధం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజన మహిళల్లో గర్భస్రావాలు, రక్తహీనత తదితర రుగ్మతలకు కారణమవుతున్న సికిల్ సెల్ ఎనేమియా నుంచి రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో అరకు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో బ్లడ్ బ్యాంక్ భవనం ఏర్పాటు కానుంది. గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుకగా నిర్మించనున్న ఈ బ్లడ్ బ్యాంకు భవనంలో అవసరాలకి అనుగుణంగా రక్తం నిల్వ చేసుకునేందుకు వీలుగా అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. పవన్ కళ్యాణ్ చొరవతో.. దాతల సహకారంతో నిర్మించనున్న ఈ భవనాన్ని నిర్మాణం అనంతరం అరకు ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానిస్తారు. అడవితల్లి బాట కార్యక్రమం ప్రారంభోత్సవానికి వెళ్లిన సందర్భంలో కురిడీ గ్రామంలో నిర్వహించిన మాటా మంతి కార్యక్రమంలో ఓ మహిళ సికిల్ సెల్ ఎనేమియా కారణంగా గిరిజన మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. జన్యుపరంగా వచ్చే ఈ రుగ్మత గర్భిణుల ఉసురు తీస్తోందని వివరించారు. ఈ సమస్యకు పరిష్కారం చూపుతానని ఆనాడు మాటిచ్చారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న పవన్ కళ్యాణ్ … సికిల్ సెల్ ఎనేమియా నివారణ ఎలా? అనే అంశంపై వైద్య నిపుణులతో పలు సందర్భాల్లో చర్చించారు. వారసత్వంగా వచ్చే ఈ వ్యాధి తీవ్రత రక్తమార్పిడి ద్వారా తగ్గించే అవకాశం ఉందన్న వారి సూచన మేరకు – నూతన సంవత్సర కానుకగా బ్లడ్ బ్యాంకు భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 1,500 మంది సికిల్ సెల్ ఎనేమియా బాధితులకు పవన్ కళ్యాణ్ నిర్ణయం ఉపశమనాన్ని ఇవ్వనుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *