-ప్రభుత్వానికి ఆర్టీసీ పట్ల మంచి అభిప్రాయ ధోరణి
-ఎప్పటికీ నిలబెట్టుకుంటూ అంకితభావంతో పనిచేద్దాం
-వి. సి. &ఎం.డి. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“2025 సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన “స్త్రీ శక్తి” పధకం అమలులో మన సిబ్బంది కృషి అభినందనీయమని తద్వారా ప్రభుత్వానికి ఆర్టీసీ పట్ల మంచి నమ్మకం కలిగిందని అదే ఎప్పటికీ నిలబెట్టుకుంటూ మునుముందు కూడా అందరూ అంకితభావంతో పనిచేయాలని సంస్థ వి.సి.&ఎం.డి.సిహెచ్.ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. అన్నారు.
ఈ రోజు ఆర్టీసీ హౌస్ లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేసి, ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించారు.
మీ అందరి సమిష్టి కృషి ఫలితంగా సంస్థలో ఉత్తమ గణాంకాలు నమోదయ్యాయి, అదే స్పూర్తిగా తీసుకుని ఈ కొత్త సంవత్సరం కూడా మనందరం అంకితభావంతో పనిచేసి ప్రభుత్వానికీ, సంస్థకూ మంచి పేరు తీసుకు వద్దాం” అని సంస్థ వి.సి.&ఎం.డి. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. అన్నారు.
ఈ సంవత్సరం కూడా ఎం.డి. గా నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సంస్థ ఎం.డి. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. తెలిపారు.
2025 సంవత్సరంలో ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం ప్రమోషన్లు ఇచ్చేందుకు అంగీకారం తెలపడమే కాకుండా ఇప్పటికే చాలా మందికి ప్రమోషన్లు ఇవ్వడం కూడా జరిగిందని, వారంతా మరింత ఉత్సాహంతో పనిచేస్తారని నమ్ముతున్నట్లు తెలిపారు. అదే విధంగా అన్ ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పి వారికి మరో కేటగిరీలో ఉద్యోగ అవకాశం లేదా వేరే ఇతర ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగం కల్పించామని జి. ఓ. జారీ చేయడం హర్షించ దగిన విషయం.
అలాగే ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలు దాదాపుగా అన్నీ చెల్లించామని ఆయన తెలిపారు. ఇక డ్రైవర్, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది స్త్రీ శక్తి పధకం అమలులో ఎంతో కృషి చేశారని, ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీ సాక్షిగా మెచ్చుకోవడం అందరికీ ఓ కితాబులాంటిదని తెలిపారు.
సంస్థలోని క్రింది స్థాయి ఉద్యోగి మొదలు ఆఫీసర్ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో సమిష్టి కృషితో పని చేశారని, అందువల్లే మెరుగైన ఫలితాలు సాధించగలిగామని ఈ కొత్త సంవత్సరంలో కూడా ఇదే స్పూర్తితో పనిచేస్తే సంస్థ మరింతగా వృద్ధి సాధిస్తుందని తెలిపారు.
త్వరలో 1500 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని మొదటగా రాజమండ్రి పుష్కర సమయంలో వాటిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుందని ఆ దిశగా ఛార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా బస్సుల నిర్వహణ ఉండాలన్నారు. మంచి బస్సులతో, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
బస్ స్టేషన్లు, డిపోలు కూడా ఆధునీకరించుకోవడం జరిగిందని, భవిష్యత్తులో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వివరించారు.
చివరగా ఈ నూతన సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానిస్తున్నామని, ఇదే ఉత్సాహంతో సంస్థ అభివృద్ధికి, ప్రతి ఒక్క ఉద్యోగి తమతమ గురుతర బాధ్యతలు నిర్వర్తించాలని, ఈ కొత్త సంవత్సరం కూడా అందరికీ మంచి జరగాలనే ఆశాభావం వ్యక్తం చేశారు.
సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఏ) కే.ఎస్. బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఓ) ఏ. అప్పల రాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇ) జి. వి. రవి వర్మ,ఎఫ్. ఏ. & సి. ఏ. ఓ. ఎన్. సుధాకర్ రావు, అసిస్టెంట్ డైరెక్టర్ (వి&ఎస్.) మధు, ఆర్టీసీ హౌస్ అధికారులు, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, ఉద్యోగులు, ఔట్ సోర్శింగ్ ఉద్యోగులు, విజయవాడ పి.ఎన్.బి.ఎస్. సిబ్బందితదితరులుపాల్గొన్నారు.
Prajavartha Online Telugu News