-సబ్ ట్రెజరీ కార్యాలయంలో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు తరలి వచ్చిన ప్రభుత్వ పెన్షన్ దారులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ఖజానా మరియు లెక్కల సంచాలకులు, మంగళగిరి వారి ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత పదవుల నుంచి వివిధ స్థాయిలలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, కుటుంబ పెన్షన్ పొందుతున్న వారు తప్పనిసరిగా 2026 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు లైఫ్ సర్టిఫికెట్ (జీవన్ ప్రమాణ్) సమర్పించాల్సి ఉంటుందని తూర్పు గోదావరి జిల్లా ఖజానా అధికారి ఎన్. సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం స్థానిక జిల్లా ఖజానా కార్యాలయంలో లైఫ్ సర్టిఫికెట్ ధృవీకరణ ప్రక్రియను ఆయన అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీటీవో సత్యనారాయణ మాట్లాడుతూ, నిర్దేశిత గడువులో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించని పక్షంలో పెన్షన్ చెల్లింపుల్లో అంతరాయం కలిగే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్‌ను జీవన్ ప్రామాణ్ అప్లికేషన్, జీవన్ ప్రామాణ్ ఫేస్ అప్లికేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో గానీ, లేదా సంబంధిత ఉప ఖజానా కార్యాలయంలో ప్రత్యక్షంగా హాజరై గానీ సమర్పించవచ్చని తెలిపారు.
ఇప్పటికే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించిన వారు కూడా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 లోపు మరోసారి తప్పని సరిగా సమర్పించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఎవరికైన బయోమెట్రిక్ సమస్యలు, ఆరోగ్య కారణాలు లేదా మంచానికి పరిమితమైన పరిస్థితుల్లో ఉన్న పెన్షనర్లు తమ వివరాలను ముందుగా సంబంధిత ఉప ఖజానా కార్యాలయానికి తెలియజేస్తే, ఖజానా సిబ్బంది స్వయంగా వారి నివాసానికి వెళ్లి లైఫ్ సర్టిఫికెట్ ధృవీకరణ చేపడతామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు మరియు కుటుంబ పెన్షన్ దారులు హాజరుకావడం ఆనందకరమని డిటివో సత్యనారాయణ తెలిపారు. ధృవీకరణకు వచ్చిన ప్రతి ఒక్కరికీ తగిన గౌరవ మర్యాదలు అందించాలని సిబ్బందికి స్పష్టమైన సూచనలు చేసినట్లు, అందుకు అనుసరించి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షన్ పొందుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నిర్ణీత గడువులో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించి పెన్షన్ చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని డిటివో ఎన్. సత్యనారాయణ కోరారు.
Prajavartha Online Telugu News