-బోర్డు సభ్యులకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ హామీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో శాశ్విత పద్దతిలో వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ శ్రీశైలం ట్రస్ట్ పాలక మండలి సభ్యులకు హామీ ఇచ్చారు. అమరావతిలోని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఏవి రమణ, బోడేపూడి వెంకట సుబ్బారావు, శంకరశెట్టి పిచ్చయ్యలు పట్టాభిరామ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. దేవస్థానం చిత్ర పటం, ప్రసాదం అందజేశారు. శ్రీశైలంలో పారిశుద్ధ్యం, వేస్ట్ మేనేజ్ మెంట్, ప్లాస్టిక్ వినియోగం, పర్యావరణ పరిరక్షణ… తదితర అంశాలపై వారు పట్టాభిరామ్ తో సుదీర్ఘంగా చర్చించారు.
ప్లాస్టింగ్ వినియోగాన్ని నిషేదిస్తాం
ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ, శ్రీశైలంలో స్వచ్ఛతను కాపాడతామని, ప్లాస్టింగ్ వినియోగాన్ని నిషేదిస్తామని హామీ ఇచ్చారు. ప్లాస్టిక్ రహిత శ్రీశైలంగా తీర్చిదిద్దుతామని, బయోడిగ్రేడబుల్ మంచినీటి సీసాలను అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే, శ్రీశైలంకు ప్రతి రోజు వేలాది మంది భక్తులు వస్తూ ఉండడం వల్ల చెత్త ఎక్కువగా చేరుతుందని, పారిశుద్ధ్య పరిరక్షణకు అన్ని చర్యలు చేపడతామన్నారు. వేస్ట్ మేనేజ్ మెంట్ ద్వారా శ్రీశైలం దేవస్థానానికి సంపద సృష్టించే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళతామని చెప్పారు. శాశ్విత చెత్త నిర్వహణ ప్లాంట్ ద్వారా తడిచెత్త, పొడి చెత్త వేరు చేసి, శాస్త్రీయ పద్దతిలో క్షేత్రంలో మొక్కల పెంపకానికి అవసరమైన సేంద్రీయ ఎరువుల తయారీ, పొడి చెత్త రీసైక్లింగ్ ద్వారా దేవాలయానికి ఆదాయం వచ్చే మార్గాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. శ్రీశైలంని ఓ మోడల్ పుణ్యక్షేత్రంగా రూపొందిస్తామని చెప్పారు.
త్వరలోనే తాను, తమ స్వచ్ఛ ఆంధ్ర కార్పోకేషన్ అధికార బృందంతో కలిసి శ్రీశైలం వెళతానన్నారు. దేవస్థానాన్ని సందర్శించి, అక్కడ పరిస్థితులను పరిశీలించి, అధికారులతో కూడా చర్చించి స్వచ్ఛ శ్రీశైలం బాధ్యత తీసుకుంటానని పట్టాభి రామ్ చెప్పారు.
Prajavartha Online Telugu News