అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రెవెన్యూ సంబంధిత సమస్యలను వీలైనంత వరకూ తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ఈనెల 2 నుండి 9 వరకూ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నందున ఆ పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరిగేలా జిల్లా కలక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలక్టర్లను ఆదేశించారు.రైల్వే అండర్ బ్రిడ్జిలు,రైల్వే ఓవర్ బ్రిడ్జిలు,రైల్వేకు సంబంధించి పెండింగ్ భూసేకరణ కేసులకు సంబంధించిన అంశాలు,పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణి,పాజిటివ్ పబ్లిక్ పెరసెప్సన్,డాక్యుమెంట్ అప్లోడ్ ఏజెంట్ అంశాలపై శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ పాత పట్టాదార్ పాస్ పుస్తకాల స్థానే రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని చేపట్టడం జరిగిందని ఏడాది పాటు ప్రతినెలా ఈపాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించి భూమి ఉన్న ప్రతి రైతుకూ ఈకొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందించడం జరుగుతుందని తెలిపారు.కావున జిల్లా కలక్టర్లు ఈపాస్ పుస్తకాల పంపిణీని స్వయంగా పరిశీలించాలని స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో పంపిణీ జరిగేలా చూడాలని ఆదేశించారు.ఇప్పటికే రెవెన్యూ శాఖ ద్వారా జిల్లాలకు తగిన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు.ముఖ్యమంత్రి వర్యులు కూడా జిల్లాల్లో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గోనున్నారని సిఎస్ పేర్కొన్నారు.
అనంతరం వివిధ రైల్వే ప్రాజెక్టులు,రైల్వే లెవెల్ క్రాసింగ్స్ స్థానే నిర్మించే ఆర్ ఓబిలు,ఆర్ యుబిలకు భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్లను సిఎస్ విజయానంద్ ఆదేశించారు. దశల వారీగా అన్ని రైల్వే లెవెల్ క్రాసింగ్ లను తొలగించి వాటి స్థాన్ రైల్వే ఓవర్ బ్రిడ్జిలు లేదా రైలేవే అండర్ బ్రిడ్జిల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నందున అవసరమైన ఆర్ఓబి,ఆర్ యుబిల నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశానికి వర్చువల్ గా పాల్గొన్న రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి సంబంధించి ఇప్పటికే 23 లక్షల పాస్ పుస్తకాలను ముద్రించి శుక్రవారం నుండి పంపిణీని మొదలు పెట్టడం జరిగిందన్నారు.రాష్ట్రంలో ఈఏడాది చివరి నాటికి రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులందరికీ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందించడం జరుగుతుందని ఈప్రక్రియ ప్రతినెలా కొనసాగుతుందని తెలిపారు.రైతుల వద్ద ఉన్న పాత పట్టాదారు పాస్ పుస్తకాలను తీసుకుని కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని పాత పుస్తకాలను ఏవిధంగా మనుగడలో లేకుండా చేయాలనే దానిపై ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేస్తామని సాయి ప్రసాద్ కలక్టర్లకు స్పష్టం చేశారు.కావున కలక్టర్లు పాస్ పుస్తకాల పంపిణీని స్వయంగా పర్యవేక్షిచాలని జెసిలకు దీనిలో పూర్తి బాధ్యత అప్పగించాలని ఆదేశించారు.నీటి పన్ను వసూలుకు సంబంధించి రైతుల నుండి బలవతంపు వసూలుకు పాల్పడకుండా వారిని ఒప్పించి సక్రమంగా వసూలు జరిగేలా చూడాలన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైల్వే లెవెల్ క్రాసింగులను(LC’s)తొలగించి వాటి స్థానే రైల్వే ఓవర్ బ్రిడ్జి లు లేదా రైల్వే అండర్ బ్రిడ్జిలను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి నిర్ణయించారని చెప్పారు.రాష్ట్రానికి అవసరమైన చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జిలు,రైల్వే అండర్ బ్రిడ్జిలు మంజూరు చేయించు కునేందుకు ఇదొక మంచి సదావకాశమని అన్నారు.రాష్ట్రంలో ఇంకా 766 రైల్వే లెవెల్ క్రాసింగ్స్ ఉండగా వాటిలో ఆర్ అండ్ బి రహదారులపై 329, పంచాయితీ రాజ్ రోడ్ల వెంబడి 319 ఉండగా మిగతావి ఇతర రహదారులపై ఉన్నాయన్నారు.ఇప్పటికే 363 ఆర్ఓబి,ఆర్ యుబిలు మంజూరు కాగా మరో 403 మంజూరు కావాల్సి ఉందని తెలిపారు.
ఈ వీడియో సమావేశంలో ఐటి శాఖ కార్యదర్శి కె.భాస్కర్,ఆర్టీజిఎస్ సిఇఓ ప్రఖర్ జైన్, డైరెక్టర్ ఐఅండ్పిఆర్ కె.ఎస్.విశ్వనాధన్ పాల్గొన్నారు.అలాగే వర్చువల్ గా వివిధ జిల్లాల కలెక్టర్లు,రైల్వేకు సంబంధించిన ఇంజనీర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News