Breaking News

ఆలయాల భద్రతపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు : గురుమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అధికారులను వేధించడం, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వ్యక్తులపై బురద జల్లడం పరమావధిగా మారిందని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి విమర్శించారు. టీటీడీ పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని పేర్కొంటూ, దీనికి అనేక ప్రత్యక్ష నిదర్శనాలు ఉన్నాయని ఆయన తెలిపారు. గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన దురదృష్టకర ఘటనలో కొంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఎంక్వయిరీ కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ, ఏడాది గడిచినా ఇప్పటివరకు ఆ నివేదిక వెలువడకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.

అదే విధంగా తిరుమల, తిరుపతిలో వరుసగా భద్రతా లోపాలు చోటుచేసుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తమ పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి ఈ భద్రతా లోపాలపై లేఖలు రాశారని, దానికి ప్రతిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, మా లేఖకు వివరణ ఇవ్వాలని ఆదేశించినప్పటికి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని తెలిపారు.

ఆలయాల భద్రతపై ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనడానికి ఇదే నిదర్శనమని ఎంపీ గురుమూర్తి అన్నారు. ఆలయాల పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేయడం వల్లనే నిన్న అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి గోవిందరాజ స్వామి ఆలయంలోని నడిమి గోపురం ఎక్కి, పవిత్రమైన కలశాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు.

రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడం, నకిలీ మద్యం విక్రయాలు జరగడం వల్ల ప్రజలు తాగి ఏం చేస్తున్నారో వారికే అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. ఈ ఘటనకు కారణమైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే పటిష్ట చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *