-జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లకు విద్యాసామగ్రిని పంపించిన జిల్లా కలెక్టర్
-నూతన సంవత్సరం సందర్భంగా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల
-పేద విద్యార్థులకు మంచి చేయాలనే కలెక్టర్ ఆలోచన పట్ల సర్వత్రా హర్షం
నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన సంవత్సర కానుకగా బాలికల వసతి గృహాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టుతూ, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల బీ.వీ. నగర్‌లోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహానికి వాషింగ్ మెషిన్‌ను అందజేశారు.
బాలికల సౌకర్యార్థం, పరిశుభ్రతతో పాటు మెరుగైన వసతి సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో, నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా సందర్శకులు అందించిన వాషింగ్ మెషిన్‌ను శనివారం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బీసీ బాలికల వసతి గృహానికి జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి అందజేయడం జరిగింది.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయటానికి స్వీట్లు, బొకేలు వంటి వాటికోసం అనవసర ఖర్చు లేకుండా విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాలోని అధికారులు, ప్రముఖులు, ప్రజలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయటానికి జిల్లా కలెక్టర్ గారిని కలిసెందుకు వచ్చినప్పుడు విద్యార్థులకు ఉపయోగపడే నోట్ పుస్తకాలు, డిక్షనరీలు, పరీక్షల ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు మొదలైన వస్తువులను అందించడం జరిగింది.
ఈ పిలుపుకు స్పందించిన అధికారులు, ప్రజలు అందించిన కానుకలలో భాగంగా ఈ వాషింగ్ మెషిన్‌ను జనవరి 1 న కలెక్టర్ కు అందించడం జరిగింది. సదరు వాషింగ్ మెషిన్ ను శనివారం బీసీ బాలికల వసతి గృహానికి అందజేశారు.
ఈ వాషింగ్ మెషిన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారి తరఫున జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికారత అధికారి శ్రీమతి పి. వెంకటలక్ష్మి పాల్గొనగా, సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి యం. శ్రీదేవి , బాలికల వసతి గృహ అధికారి చైతన్య పాల్గొన్నారు.
ఆత్మకూరు, కావలిలోని ప్రభుత్వ హాస్టళ్లకు విద్యా సామాగ్రి పంపిణీ
నూతన సంవత్సర సందర్భంగా జిల్లా కలెక్టర్ కు అందిన..నిఘంటువులు, లాంగ్ నోట్ పుస్తకాలు , షార్ట్ నోట్ పుస్తకాలు, పరీక్ష ప్యాడ్లు, పెన్సిళ్లు, పెన్స్, తదితర విద్యా సామగ్రిని ఆత్మకూరులోని సోషల్ వెల్ఫేర్ బాలుర కళాశాల హాస్టల్, బాలికల సంక్షేమ హాస్టళ్లలో, కావలిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలోని విద్యార్థులకు కలెక్టర్ ఆదేశాల మేరకు కావలి ఆర్డీవో వంశీ కృష్ణ, డిడి సోషల్ వెల్ఫేర్ పంపిణీ చేశారు.
కాగా నూతన సంవత్సరం జనవరి 1 న నెల్లూరు లోని ఆర్. కె. నగర్ లో గల జనహిత – వాత్సల్య అనాధాశ్రమంలో చదువుతున్న విద్యార్థులకు 250 పుస్తకాలు, నిఘంటువులు, ఇతర విద్యా సామగ్రి, స్వీట్స్, పండ్లు స్వయంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పంపిణీ చేసిన విషయం విదితమే
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలలోని పేద విద్యార్థులకు మంచి చేయాలనే కలెక్టర్ వినూత్న ఆలోచన పట్ల పలువురు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలుపుతున్నారు.
Prajavartha Online Telugu News