మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పుటకు అడ్డుగా ఉన్న సమస్యలన్నిటిని వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో పారిశ్రామిక యూనిట్ల పురోగతి, పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారంపై సమీక్షించారు. గత డిసెంబర్ 30 వ తేదీన పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో అందిన అన్ని సమస్యలపై జిల్లా కలెక్టర్ చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలు నెలకొల్పుటలో ఉన్న అడ్డంకులను వెంటనే తొలగించి వేగవంతంగా వాణిజ్యం (స్పీడ్ అప్ డూయింగ్ బిజినెస్) జరిగేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.
ఇందులో భాగంగా జిల్లాలో మంజూరైన 377 పరిశ్రమలను సత్వరమే ఏర్పాటు చేయుటకు 20 మంది జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించామన్నారు. వారిలో ఒక్కొక్కరికి 20 మంది పారిశ్రామిక వేత్తలను కేటాయించడం జరిగిందన్నారు.
ప్రత్యేక అధికారులు ప్రతి పారిశ్రామికవేత్తను నేరుగా సంప్రదించి వారికి ఎదురవుతున్న సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పరిశ్రమలకు కేటాయించిన భూములకు సంబంధించి సరిహద్దు సమస్యలు లేకుండా యుద్ధ ప్రాతిపదికన కొలతలు కొలిచి సరిహద్దులు నిర్ధారించాలని, ఇందుకోసం అవసరమైన సర్వేయర్లను ఆర్డిఓ కేటాయించాలన్నారు. అలాగే విద్యుత్ సరఫరా, బ్యాంకు రుణాలు తదితర అంశాలపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఈ సమావేశంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కే బాబ్జి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్ వెంకటరావు, ఎల్డీఎం రవీంద్రారెడ్డి, డిఎఫ్ఓ సునీత, హౌసింగ్ జిల్లా అధికారి పోతురాజు, జిల్లా ఉపాధి కల్పనా అధికారి బాబు, ప్రత్యేక అధికారులు, తదితర అధికారులు నేరుగా పాల్గొనగా గుడివాడ ఆర్డీవో జి బాలసుబ్రమణ్యం వర్చువల్ గా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News