-పబ్లిసిటీ కోసం రూ. 22 కోట్ల ప్రజాధనం వృధా
-రాజముద్ర, క్యూఆర్ కోడ్ తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తామన్న హామీని అమలు చేస్తున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పబ్లిసిటీ పిచ్చితో పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ రెడ్డి ఫొటోను ముద్రించారని మంత్రి ఆరోపించారు. పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేయడం కోసం వైసీపీ ప్రభుత్వ పెద్దలు సుమారు రూ. 22 కోట్ల ప్రజాధనాన్ని అనవసరంగా ఖర్చు చేశారని మండిపడ్డారు.
మంగళవారం నాడు ప్రకాశం జిల్లా జే. పంగులూరు మండలం చందలూరు గ్రామంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులకు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నమైన రాజముద్రతో ఉన్న నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రభుత్వం కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని ప్రారంభించిందన్నారు. కూటమి ప్రభుత్వం అందజేస్తున్న పాస్ పుస్తకాలు రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్‌తో అత్యంత పారదర్శకంగా రూపొందించినవని వివరించారు. గత ప్రభుత్వ పెద్దలు చేసిన తప్పులను సరిదిద్ది, ప్రజలకు భూ వివాదాలు లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మంత్రి స్పష్టం చేశారు. నూతన పాస్ పుస్తకాల పంపిణీ సమయంలో పట్టాదారుల వివరాలు తప్పుగా నమోదైతే వాటిని తక్షణమే సరిచేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. తహసీల్దార్ల లాగిన్ ద్వారా లబ్ధిదారుల ఆధార్‌తో పాటు ఇతర వివరాలను పరిశీలించి, పాస్ పుస్తకాలలో ఉన్న తప్పులను అక్కడికక్కడే సరిదిద్దే విధంగా ఏర్పాట్లు చేశామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.
ఇచ్చిన హామీ నెరవేర్చిన మంత్రి గొట్టిపాటి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా గతంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చందలూరు పాఠశాలను సందర్శించారు. ఆ సమయంలో మధ్యాహ్న భోజనం బయట ఆవరణలో కూర్చొని తినడం ఇబ్బందిగా ఉందని విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. భోజనం కోసం ప్రత్యేక డైనింగ్ హాల్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. విద్యార్థుల అభ్యర్థనకు స్పందించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్ డైనింగ్ హాల్ నిర్మాణానికి రూ. 35 లక్షలు కేటాయించి, పనులు ప్రారంభింపజేశారు. నేడు చందలూరు పర్యటనలో భాగంగా జడ్పీ హైస్కూల్‌లో నిర్మించిన భోజనశాలను ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఇచ్చిన మాట ప్రకారం భోజనశాలను ఏర్పాటు చేసినందుకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌కు విద్యార్థిని, విద్యార్థులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
విద్యార్థులకు 373 సైకిళ్లు పంపిణీ
రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. అలాగే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను కూడా కూటమి ప్రభుత్వం ఇటీవల మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేసిందని ఆయన పేర్కొన్నారు. జే.పంగలూరు మండలం చందలూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ లేక్ డిస్ట్రిక్ట్ మెయినాబాద్, అసిస్ట్, ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థల ఆర్థిక సహకారంతో మొత్తం 373 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. ఇప్పటి వరకు సీఎస్ఆర్ నిధుల ద్వారా ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ సుమారు 600కు పైగా సైకిళ్లను విద్యార్థులకు అందించినట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.
Prajavartha Online Telugu News