బొండపల్లి, (విజయనగరం), నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని రైస్ మిల్లర్లపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన బొండపల్లిలోని లక్ష్మీనారాయణ మోడరన్ రైస్ మిల్లును మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మిల్లర్ల అసోసియేషన్ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ధాన్యాన్ని మర పట్టి ప్రభుత్వానికి అప్పగించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని మంత్రి అసహనాన్ని వ్యక్తం చేశారు. సీఎంఆర్ విషయంలో ఎందుకు వెనుకబడ్డారని నిలదీశారు. ఇప్పటికి కేవలం 17 శాతం మాత్రమే పూర్తి చేయడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. బ్యాంకు గ్యారంటీల విషయంలో కూడా జిల్లాలోని మిల్లర్లకు వెసులుబాటు ఇచ్చామని, అయినప్పటికీ మిల్లింగ్ విషయంలో పెద్దగా శ్రద్ధ చూపడం లేదని అన్నారు.
రోజుకి 150 ఏసికేల చొప్పున మిల్లింగ్ చేయాలని, ఈ నెల 8 వ తేది లోగా 45,000 మెట్రిక్ టన్నులు పూర్తి చేయాలని మిల్లర్లను మంత్రి ఆదేశించారు. గోదాములు, నిల్వ సమస్య రాకుండా చర్యలు తీసుకుంటామని, ఎఫ్సిఐ అంశాన్ని కూడా పరిష్కరించామని తెలిపారు. రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. క్యూ ఆర్ కోడ్ ప్రవేశపెట్టి దేశంలోనే మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు.
మంత్రి మనోహర్ తో బాటు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి ఎస్.డిల్లీరావు, జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, డిసిఎంఎస్ చైర్మెన్ గొంప కృష్ణ, జెసి సేధు మాధవన్, ఇతర అధికారులు, కూటమి నాయకులు, మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు వెంకటరావు తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News