Breaking News

ఇసుక వ్యవస్థలో లోపాలు సరిదిద్దాలి – మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టమైన ఆదేశాలు

-కలెక్టరేట్‌లో మైన్స్ శాఖ పనితీరుపై సమీక్ష సమావేశం మంత్రి కొల్లు రవీంద్ర

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని, అయినప్పటికీ ఇసుక లభ్యత ఉన్న ప్రాంతాల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని , వాటిని గుర్తించి సమర్థవంతంగా అధిగమించాలని ప్రజలకు ఉచిత ఇసుక పంపిణీ చేయడం పై దృష్టి సారించాలని రాష్ట్ర ఎక్సైజ్ మైన్స్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

మంగళవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మైన్స్ శాఖ పనితీరుపై రాష్ట్ర మైన్స్ & జియాలజీ మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో ఇసుక సరఫరా, ఉచిత ఇసుక పాలసీ అమలు, అక్రమ తవ్వకాలు, రవాణా నియంత్రణ, ప్రజల సంతృప్తి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.
సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో ఇసుక విధానాల్లో జరిగిన లోపాల కారణంగా భవన నిర్మాణ రంగం వెనుకబడిందని, ఇప్పుడు అలా జరగకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. ఇసుక రీచ్‌ల నిర్వాహకులు అపరాధ రుసుములపై చేసిన ఆరోపణలను పరిశీలిస్తామని, అయితే చట్టబద్ధమైన విధానాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఇసుక లభ్యమయ్యే విషయంలో లోపాలను వెంటనే గుర్తించి సరిదిద్దాలని, ఇసుక రవాణాలో బిల్లులు తప్పనిసరిగా ఉండాలని, అక్రమ రవాణా, అధిక లోడ్, అక్రమ మైనింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సంతృప్తి ముఖ్యమని, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇసుక రవాణా విషయంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తుచేశారు.

పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ సర్వేలో గత మూడు నెలల్లో సుమారు 10 శాతం పెరుగుదల నమోదవడం సానుకూల పరిణామమని, ఈ స్థాయిని మరింత పెంచేలా క్షేత్రస్థాయిలో పనితీరు మెరుగుపరచాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ (ఎఫ్‌ఏసి) / జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ మాట్లాడుతూ, మంత్రి వర్యులు చేసిన సూచనల మేరకు జిల్లా యంత్రాంగం తరపున అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉచిత ఇసుక పాలసీని సమర్థవంతంగా అమలు చేయడంపై దృష్టి సారిస్తామని, అదే సమయంలో అధిక లోడ్, అక్రమ మైనింగ్, అక్రమ రవాణాపై గనులు, పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖల సమన్వయంతో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ మాట్లాడుతూ, ఇసుక లారీలలో ఓవర్‌లోడింగ్ కారణంగా రహదారి ప్రమాదాలు పెరిగి ప్రాణనష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని నివారించేందుకు ఇసుక లారీలపై కఠిన పర్యవేక్షణ చేపట్టి అధిక లోడ్‌ను అరికట్టాలని, అలాగే నదుల్లో బోట్ల ద్వారా జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను పూర్తిగా కట్టడి చేయడానికి పోలీస్ శాఖ ఇతర విభాగాలతో సమన్వయంగా పనిచేస్తుందని తెలిపారు.

జిల్లా గనులు & భూగర్భ శాఖ అధికారి డి. ఫణి భూషణ్ రెడ్డి జిల్లా ప్రగతిపై వివరాలు తెలియజేస్తూ, APSMS ద్వారా రియల్‌టైమ్ డిజిటల్ ట్రాకింగ్ అమలుతో పారదర్శకత పెరిగిందన్నారు. జిల్లాలో 77 చట్టబద్ధ అనుమతులున్న ఇసుక రీచ్‌లలో సుమారు 4.13 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని, అదనంగా అనుమతుల ప్రక్రియలో ఉన్న 43 రీచ్‌లలో 1.36 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉందన్నారు. అక్రమ రవాణాపై చర్యలతో సరిహద్దు గ్రామాల్లో ఇసుక బుకింగ్‌లు సుమారు 83 శాతం తగ్గాయని, గ్రావెల్, ఓపెన్ ఎర్త్, రోడ్ మెటల్ అక్రమ తవ్వకాలపై రూ.39.31 లక్షల జరిమానా వసూలు చేసినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ (ఎఫ్‌ఏసి)/జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ముప్పిడి వెంకటేశ్వరరావు, జిల్లా మైన్స్ అధికారి డి. ఫణి భూషణ్ రెడ్డి, ఆర్డీవో రాణి సుస్మితతో పాటు మైన్స్, రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, గ్రౌండ్ వాటర్, ఇరిగేషన్ అధికారులు, బోట్స్‌మాన్ సొసైటీ, క్వారీ యూనియన్, ఇసుక రీచ్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *