-మచిలీపట్నంలో రూ. 39 కోట్ల విలువైన రహదారుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
-రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పలు రహదారుల అభివృద్ధికి శంకుస్థాపనలు చేసిన మంత్రి
కాలేఖాన్ పేట/చిన్నాపురం(మచిలీపట్నం), నేటి పత్రిక ప్రజావార్త :
గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
బుధవారం ఉదయం మచిలీపట్నం నియోజకవర్గంలోని రూ. 33 కోట్ల నిధులతో మచిలీపట్టణం – కమ్మవారి చెరువు వయా చిన్నాపురం రెండు వరుసల ఆర్ అండ్ బి రహదారి విస్తరణ పనులు, అదేవిధంగా రూ. 6 కోట్లతో మచిలీపట్టణం శివగంగ దేవాలయం దగ్గర నుండి చిన్నాపురం వరకు రోడ్డు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, కాలేఖాన్ పేట, చిన్నాపురంలో రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి మొత్తం రూ.39 విలువైన రహదారుల అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు.
అనంతరం కాలేఖాన్ పేట, చిన్నాపురంలో ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమం ద్వారా, రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.3,300 కోట్లు మంజూరు చేసి ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా రహదారులను అభివృద్ధి చేశామన్నారు. మచిలీపట్నం నియోజకవర్గానికి దాదాపు రూ.30 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశామని, మిగిలిన రహదారుల అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేసి సహకరిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న స్వేచ్ఛ వాణిజ్యం, రాయితీలను మెచ్చి రాష్ట్రంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. త్వరలో మచిలీపట్నం పోర్టు, ఫిషింగ్ హార్బర్లను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. గతంలో కాలేఖాన్ పేట నుంచి చిన్నాపురం వరకు ఏక వరుసతో ఉన్న రహదారిని రూ.10 కోట్లు వెచ్చించి రెండు వరుసల రహదారిగా అభివృద్ధి చేశామని, దానితోపాటు రూ.30 కోట్ల వ్యయంతో గుండేరుపై ఒకటి, గుండుపాలెం వద్ద మరొకటి మొత్తం రెండు వంతెనలు నిర్మించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాడు ఆ రహదారులను రూ.10 కోట్లతో అభివృద్ధి చేశామని, అయితే నేడు మరో రూ.6 కోట్ల నిధులను వెచ్చించి రహదారుల విస్తరించి అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. అదేవిధంగా గత టిడిపి ప్రభుత్వ హాయం 2014–19 కాలంలో రూ.60 కోట్ల వ్యయంతో ఉల్లిపాలెం బ్రిడ్జి నిర్మించామని చెబుతూ, చిన్నాపురం నుంచి కమ్మవారి చెరువు వరకు దాదాపు రూ.33 కోట్ల వ్యాయంతో రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గానికి ఆర్ అండ్ బి నుంచి దాదాపు రూ.46 కోట్ల నిధులు మంజూరు చేసి సహకరించారని మంత్రి అభినందించారు. 216 జాతీయ రహదారి విస్తరణలో భాగంగా లోసరి వంతెన నుంచి కానూరు, మంగినపూడి, గిలకలదిండి, పోలాటితిప్ప, వాడపాలెం, కోడూరు వంటి తీర ప్రాంతాల వెంబడి నిజాంపట్నం వరకు అభివృద్ధి చేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయటం అభినందనీయమన్నారు.
ఈ సందర్భంగా మచిలీపట్నం విచ్చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి చిన్నాపురంలో సంక్రాంతి వేడుకలు పురస్కరించుకుని గ్రామస్తులు గంగిరెద్దులతో ఆత్మీయ స్వాగతం పలికారు. చిన్నాపురంలోని శ్రీ వెంకటచలస్వామి దేవాలయానికి విచ్చేసిమంత్రులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర రహదారులు చీఫ్ ఇంజనీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్ శ్రీనివాస్ రెడ్డి, రహదారులు భవనాలు ఎస్ఈ (విజయవాడ) భాస్కరరావు, ఈఈ లోకేష్ రావు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ లంకె నారాయణ ప్రసాద్, జనసేన పార్టీ నేత బండ్రెడ్డి రామకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, చిన్నాపురం సర్పంచ్ కాగిత గోపాలరావు, కూటమి నాయకులు బచ్చుల అనీల్, మధుసూదనరావు, సోమశేఖర్, ఇలియాస్ భాష తదితర నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News