-రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత ప్యాకేజీపై ఎస్‌బీఐతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఫలితం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సచివాలయం ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరుగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీమతి ఎన్. కుసుమ కరుణ కుమారి 2025 మే 3న రోడ్డు ప్రమాదంలో అకాల మృతి చెందిన నేపథ్యంలో ఉద్యోగి కుటుంబ సభ్యులకు వ్యక్తిగత ప్రమాద బీమా పథకం క్రింద రూ.1 కోటి బీమా సొమ్ము చెక్కును రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అందజేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో పలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఎస్బీఐ అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి మృతురాలి కుటుంబ సభ్యులకు బీమా సొమ్ము చెక్కును అందజేసి ప్రభుత్వం తరుపున ప్రగాడ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు.
ఈ సందర్బంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. కోవిడ్ సమయంలో పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఏడాదికి సగటున 150 మంది వరకూ మరణించడం తమ ప్రభుత్వం గుర్తించిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల లబ్ది చేకూర్చినప్పటికీ, ప్రైవేటు రంగ పరంగా కూడా మరింత లబ్దిని చేకూర్చితే బాగుంటుందనే విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ వ్యక్తిగత ప్రమాద భీమా పథకాన్ని వర్తింపచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగుల సమగ్ర జీత ప్యాకేజీపై గత ఏడాది మార్చి మాసంలో ఎస్‌బీఐ, యుబిఐ, యాక్సిస్ మరియు ఇండియన్ తదితర బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్నారు. ఈ బ్యాంకులకు ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను అన్నింటినీ అందజేస్తూ వారి ఖాతాలను అన్నింటినీ శాలరీ ఖాతాలుగా ఆటోమేటిక్ గా మార్చడం జరిగిందన్నారు. ఉద్యోగుల వ్యక్తిగత ప్రమాద బీమా పథకం పై గత ఏడాది మార్చిలో బ్యాంకులతో ఒప్పందం కురుర్చుకున్న రెండు మాసాల్లోనే ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరుగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీమతి ఎన్. కుసుమ కరుణ కుమారి రోడ్డు ప్రమాదంలో మరణించడం దురదృష్టకరమన్నారు. ఉద్యోగుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ తమ ప్రభుత్వం బ్యాంకులతో చేసుకున్న ఒప్పందం ఫలితంగా తొలి వ్యక్తిగత ప్రమాద బీమా పథకం క్రింద బీమా సొమ్మును శ్రీమతి ఎన్. కుసుమ కరుణ కుమారి కుటుంబ సభ్యులు పొందడం జరిగిందన్నారు. ఈ భీమా పథకం యొక్క ప్రయోజనాన్ని గుర్తించి కార్పొరేషన్ ఉద్యోగులకు మరియు ఇతర ఉద్యోగులకు కూడా దశలవారీగా వర్తింపచేయాలని ఉద్దేశ్యంలో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఈ అంశంపై విస్తృత అవగాహన కల్పించి ఉద్యోగులు అంతా తమ ఖాతాలను శాలరీ ఖాతాలుగా మార్చుకునే విధంగా మోటివేట్ చేయాలని అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులను మంత్రి కోరారు.
ఆర్థిక శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ పియూష్ కుమార్, సెక్రటరీ వినయ్ చంద్, జాయింట్ సెక్రటరీ గౌతమ్, ఎస్బీఐ అధికారులు తదితరులతో పాలు పలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు, మృతురాలి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News