-ఏపీని ప్రపంచ సృజనాత్మక రాజధానిగా మారుస్తాం: మంత్రి కందుల దుర్గేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర కృష్ణా నది తీరాన నిర్వహిస్తున్న ‘ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్’ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవానికి,కళా, సాహిత్య, సినిమా, పర్యాటక రంగానికి కొత్త ఊపిరి పోస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి *కందుల దుర్గేష్* ఆకాంక్షించారు. గురువారం విజయవాడలో జరిగిన ఆవకాయ్ అమరావతి ఉత్సవాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కనుమరుగవుతున్న కళలు, సాహిత్యం, సినిమా మరియు జానపద సంప్రదాయాలకు పునరుజ్జీవం కల్పించడమే ఈ ఫెస్టివల్ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఏమన్నారంటే.. ప్రతి తెలుగు ఇంటికి ‘ఆవకాయ్’తో ఎంతటి విడదీయలేని బంధం ఉందో, ఈ ఉత్సవం కూడా సినిమా, సాహిత్యం, సంగీతం, నాటకం మరియు కళా ప్రదర్శనల సమ్మేళనంగా అంతటి ఆత్మీయతను పంచుతుందని మంత్రి వివరించారు. అభివృద్ధిని కేవలం ఐటీ, పరిశ్రమలతోనే కాకుండా, ‘సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ’ (Creative Economy) ద్వారా సాధించవచ్చని మంత్రి స్పష్టం చేశారు. కథలు, సినిమాలు, డిజిటల్ కళలే పెట్టుబడిగా ఉపాధిని సృష్టించడాన్ని ఆయన ‘ఆరెంజ్ రెవల్యూషన్’గా అభివర్ణించారు. రాబోయే రోజుల్లో ఈ నదీ తీరం ఒక సజీవ పాఠశాలగా మారుతుందని, ఇందులో 60 మందికి పైగా ప్రముఖ కళాకారులు, 40 మంది వక్తలు, 13 కళా బృందాలు పాల్గొని 28 రకాల ప్రత్యేక కార్యక్రమాలు, అంతర్జాతీయ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వ నూతన పర్యాటక విధానం 2024-29 ద్వారా పర్యాటక రంగానికి ‘పారిశ్రామిక హోదా’ కల్పించామని, దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడులు పెరిగి పర్యాటకం కొత్త పుంతలు తొక్కుతుందని తెలిపారు. గత ఐదేళ్లలో జానపద కళలు, అన్ని రంగాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో వాటిని మళ్ళీ గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశానికే కోహినూర్ వజ్రం లాంటిదని, ఇక్కడి ప్రతి నదికి ఒక కథ, ప్రతి కళకు ఒక ఆత్మ ఉందని పేర్కొంటూ.. రాష్ట్రాన్ని ప్రపంచ సాంస్కృతిక రాజధానిగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
అంతకుముందు పర్యాటకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఎండి ఆమ్రపాలి కాట, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశలతో కలిసి మంత్రి దుర్గేష్ అమరావతి ఆవకాయ ఫెస్టివల్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Prajavartha Online Telugu News