-గోడ పత్రికను, కరపత్రాలను ఆవిష్కరించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆపారమైన పశు సంపదకు నిలయం అని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నెల 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన గోడ పత్రికను, కరపత్రాలను సోమవారం విజయవాడ క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒంగోలు, పుంగనూరు గోజాతులు, శ్రేష్ఠమైన నెల్లూరు, మాచెర్ల గొర్రెల జాతులు, అలాగే ఆశిల్ జాతి కోళ్లు మన రాష్ట్రంలో ఉండడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా స్థిరమైన ఆదాయ వనరుగా పశుసంవర్ధన రంగం కొనసాగుతూ, ఈ రంగంపై ఆధారపడిన వారికి ప్రధాన జీవనాధారంగా మారిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 25 లక్షల కుటుంబాలు పశుసంవర్ధనపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 108.19 లక్షల ఆవులు & గేదెలు, 231.49 లక్షల గొర్రెలు&మేకలు (దేశంలో 2వ స్థానం), 1078.63 లక్షల కోళ్లు (దేశంలో 2వ స్థానం) ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2025 సంవత్సరంలో పశువుల ఆరోగ్య రక్షణ, ఉత్పాదకత పెంపు, వ్యాధుల నియంత్రణ, పశుపోషణ ఖర్చుల తగ్గింపు మరియు శాస్త్రీయ పశుపోషణపై అవగాహన పెంచే లక్ష్యంతో రాష్ట్రంలోని 13,257 గ్రామాలలో జన్మభూమి తరహాలో పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించామని మంత్రి తెలిపారు. ఈ శిబిరాల ద్వారా 10,48,980 పశువులకు పశువైద్య సేవలు అందించడంతో పాటు 5,36,387 మంది పశుపోషకులు లబ్ది పొందారని పేర్కొన్నారు. అదే స్పూర్తితో ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరాలలో ముఖ్యంగా పశువైద్య చికిత్సలు, గర్భకోశ వ్యాధులకు చికిత్స, నట్టల నివారణ మందుల పంపిణీ (గొర్రెలు, మేకలకు సంవత్సరానికి 4 సార్లు, పెద్ద పశువులకు 2 సార్లు), వ్యాధి నిరోధక టీకాలు, పశువ్యాధుల నిర్ధారణ పరీక్షలు, శాస్త్రీయ పశు యాజమాన్యంపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు. ఈ అవకాశాన్ని రాష్ట్రంలోని పశుపోషకులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశుసంవర్ధక శాఖ సిబ్బంది బాధ్యతాయుతంగా శిబిరాలను నిర్వహించి, పశుపోషకులకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డా. దామోదర్ నాయుడు, డిప్యూటీ డైరెక్టర్ డా. ప్రసాదరావు, అసిస్టెంట్ డైరెక్టర్ డా. సాయి గోపాల్, అసిస్టెంట్ సర్జన్ డా. మురళీ మోహన్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News