-బీకేవీకి అమరావతి-బెంగుళూరు కారిడార్ పేరు పెట్టండి: సీఎం చంద్రబాబు
-సీఎం చంద్రబాబు నాయకత్వంలో వేగంగా పనులు
-చంద్రబాబు తన జీవితాన్ని ప్రజా శ్రేయస్సుకు అంకితం చేశారు : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
-బీకేవీ గిన్నీస్ రికార్డు వర్చువల్ కార్యక్రమానికి వర్చువల్గా హాజరైన సీఎం, కేంద్రమంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాయకత్వంలో రహదారుల నిర్మాణంలో ప్రపంచ స్థాయిలో రికార్డులను సాధించటం గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బెంగుళూరు- విజయవాడ ఎకనామిక్ కారిడార్లో నాలుగు గిన్నీస్ రికార్డులు సాధించడంపై సత్యసాయి జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…‘మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్ల అందరితో కలిసి ఈ ఉమ్మడి విజయంలో వర్చువల్గా పాల్గొంటున్నాం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పనిచేసే వేగం, సామర్ధ్యం దేశంలో అందరికీ పరిచయమే. రాజ్ పథ్ ఇన్ ఫ్రా కామ్ సంస్థను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వేగంగా అత్యంత పొడవైన బిటుమిన్తో కూడిన 6 లేన్ల జాతీయ రహదారిని వేగంగా నిర్మించి గిన్నిస్ రికార్డును సాధించారు. 10,655 మెట్రిక్ టన్నుల బిటుమిన్ కాంక్రీట్ నిరంతరాయంగా వేస్తూ మరో ప్రపంచ రికార్డు సాధించారు. జనవరి 6 నుంచి 11 వరకూ ఏక బిగిన 52 కిలోమీటర్ల మేర 6 లేన్ కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించారు. అలాగే 84.4 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారిని నిర్మించిన రికార్డును తిరగ రాశారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్వేలు 10 వేల కిలోమీటర్ల మేర వేగంగా చేపడుతున్నారు. అమరావతి నుంచి బెంగుళూరు కు నేరుగా రోడ్డును వేయాలని నిర్ణయించాం. కొత్తగా నిర్మిస్తున్న ఈ కారిడార్ కు అమరావతి బెంగుళూరు రోడ్డుగా దీనిని పేరు పెట్టాలని కోరుతున్నాను. బృందంగా పనిచేసి విజయం సాధించిన అందరికీ అభినందనలు తెలియచేస్తున్నాను’ అని సీఎం అన్నారు.
నేషనల్ హైవే ప్రాజెక్టులు చేపట్టేందుకు ఏపీ నుంచి పూర్తి సహకారం : కేంద్రమంత్రి
భగవాన్ సత్యసాయి ఆశీర్వాదంతో బెంగళూరు-విజయవాడ కారిడార్ నిర్మాణంలో ప్రపంచ రికార్డులను సాధించగలిగామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ‘సత్యసాయి జిల్లాలో బెంగుళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో 4 గిన్నీస్ రికార్డులు సాధించటంపై అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ఎక్కడా నాణ్యతలో రాజీ లేకుండా వేగంగా జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. కొత్త ఆవిష్కరణల ద్వారా జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాం. వరిగడ్డి ద్వారా బిటుమిన్ తయారీకి సంబంధించి కొత్త ఆవిష్కరణ చోటు చేసుకుంది. దానిని ఉపయోగించటంలో ఏపీ కూడా భాగస్వామి కావాలని కోరుతున్నాను. నైపుణ్యం, ఆవిష్కరణలు, మేధోపరమైన ఆలోచనలు నాణ్యత పెంచి వ్యయాన్ని తగ్గించాలి. అదే సమయంలో పర్యావరణాన్ని కాపాడుతూ కాలుష్య రహిత విధానాలు అవలంబించాల్సి ఉంది. అందుకే జాతీయ రహదారుల సంస్థలో ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డులను సాధించగలిగాం.
నిరంతరం అభివృద్ధి, విజన్ దిశగానే చంద్రబాబు ఆలోచనలు
ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వేగంగా పనులు చేపట్టేందుకు ఆస్కారం కలిగింది. జాతీయ రహదారుల ప్రాజెక్టులను చేపట్టేందుకు పూర్తి సహకారం ఏపీ ప్రభుత్వం నుంచి అందుతోంది. వాస్తవానికి ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల ప్రత్యక్షంగా హాజరు కాలేక పోయాను. ప్రస్తుతం భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్ధిక వ్యవస్థ, రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గించాల్సి ఉంది. రవాణా వ్యయం 9 శాతం కంటే తక్కువగా పరిమితం అయ్యేలా మనం అంతా పనిచేయాల్సి ఉంది. లాజిస్టిక్స్ వ్యయం తగ్గటం ద్వారా మెరుగైన ఫలితాలను, వృద్ధిని సాధించేందుకు వీలు కలుగుతుంది. బెంగుళూరు-విజయవాడ మార్గంలో ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రతిపాదనల్ని ఆమోదించేందుకు మేం సర్వదా సిద్ధం. ముఖ్యమంత్రి చంద్రబాబు తన జీవితాన్ని ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధికి అంకితం చేస్తూ పనిచేస్తారు. నిరంతరం అభివృద్ధి, విజన్ దిశగానే ఆయన ఆలోచనలు ఉంటాయి. రికార్డులను సాధించటంలో సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను’ అని నితిన్ గడ్కరీ అన్నారు.
Prajavartha Online Telugu News