గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పెదఅవుటపల్లిలోని ప్రసిద్ధ బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. క్షేత్ర నిర్వాహకుల ప్రత్యేక ఆహ్వానం మేరకు బుధవారం రాత్రి పుణ్యక్షేత్రానికి చేరుకున్న ఎమ్మెల్యే వెంకట్రావ్ కు క్రైస్తవ మత పెద్దలు, భక్తులు ఘనస్వాగతం పలికారు.
ముందుగా ఎమ్మెల్యే పుణ్యక్షేత్రంలో తంబి సమాధిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం క్షేత్ర బాధ్యులు పాలడుగు జోసఫ్ ఫాదర్, యార్లగడ్డ వెంకట్రావును శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ఈసందర్బంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అందరూ కొలిచే బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం సంతోషకరమని అన్నారు. బ్రదర్ జోసఫ్ తంబి ఈ ప్రాంతంలోని పేదలకు ఎంతో సేవ చేశారని ఆయన సేవలు మరువలేనని కొనియాడారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు తన ప్రార్థనల ద్వారా స్వస్థత పరిచి దైవజనులుగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని యార్లగడ్డ ఆకాంక్షించారు. పుణ్యక్షేత్ర అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫాదర్ ఆలయ విశిష్టతను వివరిస్తూ బ్రదర్ జోసఫ్ తంబి ఈ ప్రాంతంలో చేసిన సామాజిక సేవలను, క్షేత్రానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను వివరించారు. నిస్వార్థ సేవకు జోసఫ్ తంబి నిలువుటద్దమని, ఆయన మార్గదర్శకత్వంలో ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఏఎంసీ ఉపాధ్యక్షులు కొండేటి వెంకటేశ్వర్ రావు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News