నారావారి పల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నారావారి పల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని, రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ని మరియు వారి కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా డా. హరిప్రసాద్ ముఖ్యమంత్రి కి, మంత్రి కి మరియు వారి కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ, ప్రజల సంక్షేమం మరియు రాష్ట్ర అభివృద్ధి దిశగా ఉమ్మడి NDA ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
అనంతరం డా. హరిప్రసాద్ తిరుమలలో లేపాక్షి షోరూమ్ 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, అక్కడి లేపాక్షి షోరూమ్‌ను ఆధునిక వసతులతో రినోవేషన్ (పునరుద్ధరణ) చేయించేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానముల EO కి, అడిషనల్ EO కి అవసరమైన ఆదేశాలు ఇవ్వవలసిందిగా ముఖ్యమంత్రి ని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.
అదేవిధంగా, తిరుపతి శిల్పరామం ప్రాంగణంలో లేపాక్షి ఆధునిక మెగా షోరూమ్ ఏర్పాటు చేయుటకు సంబంధించి, తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి అవసరమైన ఆదేశాలు ఇవ్వవలసిందిగా ముఖ్యమంత్రి ని డా. హరిప్రసాద్ కోరారు. ఈ మెగా షోరూమ్‌ను అంతర్జాతీయ స్థాయిలో, ఆధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనివల్ల రాష్ట్ర హస్తకళాకారులకు విస్తృత అవకాశాలు లభించడంతో పాటు, తిరుమల–తిరుపతి ప్రాంతానికి విచ్చేసే దేశ విదేశ భక్తులకు ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలను మరింత సమర్థవంతంగా పరిచయం చేసే అవకాశం ఉంటుందని వివరించారు.
ఈ సందర్భంగా డా. హరిప్రసాద్, ముఖ్యమంత్రి కి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందజేశారు. అలాగే ముఖ్యమంత్రి పై, ఉప ముఖ్యమంత్రి పై, మంత్రి పై మరియు ఉమ్మడి NDA కూటమి నాయకులపై ఎల్లవేళలా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
ఈ వినతిపై స్పందించిన ముఖ్యమంత్రి, హస్తకళల అభివృద్ధి, సంప్రదాయ కళల పరిరక్షణ మరియు కళాకారుల సంక్షేమానికి ఉమ్మడి NDA ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. లేపాక్షి షోరూమ్ రినోవేషన్ మరియు తిరుపతి శిల్పరామంలో మెగా షోరూమ్ ఏర్పాటు ప్రతిపాదనలను సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు డా. హరిప్రసాద్ తెలిపారు.
ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ హస్తకళా రంగ అభివృద్ధికి, ఉపాధి అవకాశాల విస్తరణకు మరియు రాష్ట్ర సంప్రదాయ కళలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చే దిశగా కీలకంగా నిలుస్తుందని డా. హరిప్రసాద్ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News