విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత దేశంలో జనవరి 15కు ఒక ప్రత్యేకత ఉంది. భారత సైన్యం పరాక్రమాన్ని, ధీరత్వాన్ని, త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన ప్రత్యేకమైన రోజు ఇది. దేశం కోసం సైనికులు చేస్తోన్న త్యాగాలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం జనవరి 15న ఇండియన్ ఆర్మీ డేను (Indian Army Day) నిర్వహిస్తారని ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకర్‌రావు అన్నారు.
దేశ రక్షణలో ముందుండేది ఇండియన్ ఆర్మీ. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ సేవలో పులకించేపోయే జవాన్ల త్యాగం వెలకట్టలేనిది. ఎముకలు కొరికే చలిని, దహించే వేడి, తడిసి ముద్ద చేసే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శత్రు సేనల నుంచి దేశానికి కాపాలాగా.. ఉండే యోధులు మన జవాన్లు. ఓ వైపు బాంబుల మోతలు, బుల్లెట్ల వర్షం కురుస్తున్నా.. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో క్లిష్టసమయాల్లో మన సైనికులు ప్రదర్శించే ధైర్యసాహసాలు అసామాన్యమన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన దేశానికి చెందిన ఒక కమాండర్‌కు సైన్యాధికారిగా బాధ్యతలు అప్పజెప్పిన రోజుకు గుర్తుగా ఇండియన్ ఆర్మీ డేను జరుపుకుంటున్నారు. 1949లో భారతదేశానికి చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ అయిన జనరల్ ఫ్రాన్సిస్ బుచర్ నుంచి లెఫ్టినెంట్ జనరల్ కె.ఎమ్.కరియప్ప ఇదే రోజున భారత సైన్యానికి కమాండర్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి జనవరి 15ను ఇండియన్ ఆర్మీ డేగా గుర్తిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఏర్పాటు చేసే వేడుకల్లో భాగంగా సైనికులకు శౌర్య పురస్కారాలు, సేన పతకాలు అందజేస్తారన్నారు.
Prajavartha Online Telugu News