అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మార్తాండుడి మకరరాశి ప్రవేశం మకర సంక్రాంతికి ఆహ్వానం.
ఉత్తరాయణం పుణ్యకాలం ఉత్తమ గతులకు శ్రేయస్కరం..
పుష్యమి పలకరింపులు ప్రకృతి పులకరింపులు…
భోగి, సంక్రాంతి, కనుమ ముచ్చటగా మూడు రోజుల పండుగే ఈ మకర సంక్రాంతి..
భోగి మంటలో చెడుని పారద్రోలి, మంచికి ఆహ్వానం పలుకుదాం..
ప్రాతః కాలంలో పిల్లలు పెద్దలు అందరూ కలసి, భోగి మంటలు వేసి, కేరింతలు కొడుతూ ఆట, పాటలతో నృత్యాలు చేస్తారు…
ఇంటి ముంగిట కన్నె పిల్లలు వేసే ముగ్గులు,ఆ ముగ్గులలో పెట్టె గొబ్బెమ్మలు, బంతి పూలు, పసుపు, కుంకుమలతో చేసే కనువిందు చూడతరమా !
భోగి రోజు సాయంత్రం పసిపిల్లల శిరస్సుపై భోగిపళ్ల కోలాహలం !
కొత్త అల్లుళ్ళ రాకతో, బావా, మరదల్ల ఆటపట్టింపుల సందడులు.
పెద్దలకు బట్టలు, నైవేద్యంలు పెట్టి వారి ఆశీస్సులు తీసుకుంటారు…
హరిలోరంగహరి అంటూ హరిదాసులు పలికే సంకీర్తనలు, బుడబుక్కల వారి డబుక్కులు..
డూడు బసవన్నల సయ్యాటలు,
కోడి పందేల కోలా హలాలు..అంబరాన్ని అంటే గాలి పటాలు…
ఇంటింటా పొంగళ్ళు, అరిసెలు,బూరెలు, జంతికల వాసనలతో వీధి వీధి గుబాళింపు..
రైతన్నల ఆరుగాళ్ల కష్టం సంబరంగ ఇంటికి చేరగా…
సంబరంగా ఇంటిల్లి పాది సంక్రాంతి లక్ష్మి కి స్వాగతం పలుకగా…
కనుమ రోజు పశువుల పండుగ.
పశువుల కొమ్ములకు రంగులు వేసే ఆచారమే ఈ కనుమ పండుగ…
మెడలో జేగంటల అలంకరణ లో పశువుల పండుగ ..
అందరి కష్టాలు కడతేరి మనస్సులు మురియగా..సంతృప్తి తో గడపాలి సంక్రాంతి సంబరాలు సంబరంగా….
మన తెలుగింట జరుపుకునే సంక్రాంతి ,
ప్రతి సంవత్సరం వచ్చే సంక్రాంతి ,
ప్రతి ఇంటికి తేవాలి క్రాంతి…
హమ్మయ్య ! మూడు రోజుల ముచ్చటైన పండుగ కోలాహలం మన పల్లెటూరు లో ముగిసింది.. వీడ్కోలు చెబుతూ పయనమయ్యారు నగరానికి కుర్రకారు…
-కొడాలి బేబీ జగదీష్,
నడింపల్లి.
Prajavartha Online Telugu News