– పల్నాడు ఘటనను రాజకీయంగా మలచే ప్రయత్నం దురదృష్టకరం
– వ్యక్తిగత గొడవకు కుల, రాజకీయ రంగు పులిమే యత్నం
– పల్నాడులో గత వైసీపీ పాలనలో హింస, దౌర్జన్యాలు
– బీసీలు, బలహీన వర్గాలపై జరిగిన అఘాయిత్యాలు ప్రజలకు గుర్తున్నాయి
– పిన్నెల్లి, మాచర్ల ఘటనలు వైసీపీ అరాచకానికి నిదర్శనం
– డ్రైవర్ హత్య, డాక్టర్ సుధాకర్ ఘటనల్లో న్యాయం ఎక్కడ?
– కుట్రల రాజకీయాలే వైసీపీ పతనానికి కారణం
– ప్రజల శాంతి భద్రతలకు చంద్రబాబు నాయుడే భరోసా
– ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
హత్య రాజకీయాలు, కక్ష సాధింపులకు కూటమి ప్రభుత్వం విరుద్ధమని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఒక వ్యక్తిగత ఘటనను రాజకీయ రంగు పులిమి రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టించాలనే దురుద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని మంత్రి ఆరోపించారు. ‘‘తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా పని చేసింది. ఎన్‌టీఆర్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాల్లో కుట్రదారులపై కఠిన చర్యలు తీసుకున్న ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అయితే వ్యక్తిగత కక్షల్ని రాజకీయంగా మలచి విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు దురదృష్టకరం’’ అని అన్నారు. పల్నాడులో జరిగిన ఘటన పూర్తిగా వ్యక్తిగత గొడవేనని, దానిని ఆసరాగా చేసుకుని కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. వైసీపీ పాలనలో పల్నాడు ప్రాంతంలో గ్రామాలపై దాడులు, మహిళలపై అఘాయిత్యాలు, ప్రజలను గ్రామాల నుంచి తరిమివేసిన ఘటనలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయని చెప్పారు. “ఆ రోజుల్లో జరిగిన దౌర్జన్యాలను ప్రజలు మర్చిపోయారని వైఎస్సార్ పార్టీ అనుకుంటే అది భ్రమే” అని వ్యాఖ్యానించారు. జగన్‌మోహన్ రెడ్డి హయాంలో రాజకీయ హింసకు పాల్పడిన పలువురు నేతల ఉదాహరణలను మంత్రి గుర్తు చేశారు. “డ్రైవర్ హత్య ఘటనలోనూ, డాక్టర్ సుధాకర్ వ్యవహారంలోనూ న్యాయం జరగలేదు. ఇవన్నీ నడిరోడ్డుపై జరిగిన దుర్మార్గాలు. అలాంటి సంస్కృతినే ఇప్పుడు మళ్లీ ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నారు” అని విమర్శించారు.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారధ్యంలో కూటమి ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో రాజీపడదని స్పష్టం చేశారు. ‘‘ఎవరు ఎంతటి వారైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. కుట్రలు చేసేవాళ్లే చివరకు ఇరుక్కుంటారు. ఇది ఇటీవల వెలుగులోకి వచ్చిన మధ్యంస్కామ్‌లో కూడా స్పష్టమైంది’’ అని అన్నారు. మద్యం విధానంపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని పేర్కొంటూ, గత ప్రభుత్వంలో ఏఆర్టీ పేరిట ప్రజలపై భారం మోపారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంతో నాణ్యమైన మద్యం పక్క రాష్ట్రాల ధరలకు సమానంగా, కొన్ని సందర్భాల్లో తక్కువ ధరలకు అందుబాటులో ఉందని చెప్పారు. మైక్రో బ్రూవరీల అనుమతులు కూడా పూర్తిగా పారదర్శకంగా, టూరిజం అభివృద్ధి అవసరాల దృష్ట్యానే ఇస్తున్నామని వివరించారు.
అంబేద్కర్ విగ్రహాలపై దాడులు, తిరుపతి ఘటనలు, తప్పుడు వీడియోలు, సోషల్ మీడియా ప్రచారాలన్నీ ఉద్దేశపూర్వక కుట్రలేనని మంత్రి ఆరోపించారు. “రాష్ట్రవ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా అసాంఘిక శక్తులపై నిఘా పెట్టాం. రౌడీషీటర్లు, కుట్రదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు. ‘‘ప్రజల విశ్వాసంతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం శాంతి, భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉంది. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజలు వాటిని నమ్మే పరిస్థితి లేదు. హింసా రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్‌లో స్థానం లేదు’’ అని అన్నారు.
Prajavartha Online Telugu News