– పి.జి.ఆర్.ఎస్ అర్జీ స్థితిని 1100 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు
-“మీకోసం” వెబ్ సైట్ లో పి.జి.ఆర్.ఎస్ అర్జీలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్), రెవెన్యూ క్లినిక్ లను సోమవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ లను ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరం ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. రెవిన్యూ క్లినిక్ లలో జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, గుంటూరు, తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారులు గ్రామ స్థాయి రికార్డులతో హాజరు అవుతారని తెలిపారు. మండలాల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేసి, ప్రజల నుంచి అర్జీలను నేరుగా స్వీకరించి నమోదు చేయడంతో పాటు, సమస్యల స్వరూపాన్ని బట్టి అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. అప్పటికప్పుడే పరిష్కారం చేయలేని సమస్యలను వారం రోజులలో పరిష్కారం చేయుటకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను డివిజనల్, మండల రెవిన్యూ అధికారులు సమర్పిస్తామని వివరించారు.
రెవెన్యూ క్లినిక్ కు నాలుగు కౌంటర్ లు
రెవెన్యూ క్లినిక్ కు నాలుగు కౌంటర్ లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు.
మొదటి కౌంటర్లో కొత్త డి పట్టా మంజూరు, డి పట్టాదారుని పేరు
రెవెన్యూ రికార్డులలో నమోదు చేయుట, ప్రభుత్వ మరియు ప్రైవేటు భూముల ఆక్రమణ, నిషేధిత భూములు 22 (ఏ) నుండి తొలగించుట, కొత్త ఇండ్ల స్థలము పట్టాకు అర్జీలు సమర్పించవచ్చని అన్నారు.
రెండవ కౌంటర్లో భూ సేకరణ సమస్యలు, సి.ఆర్.డి.ఏ సమస్యలు, అర్బన్ ల్యాండ్ సీలింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిహారం, పౌర సరఫరాలకు సంబంధించిన అంశాలు, ఎఫ్ఎంసి, కులం, పుట్టిన తేదీ, మరణ ధ్రువీకరణ పత్రాలు తదితర సర్టిఫికెట్లకు, మీ సేవకు సంబంధించినవి తీసుకోవడం జరుగుతుందన్నారు.
మూడవ కౌంటర్లో సుమోటో సవరణలు, ప్రైవేటు భూముల వివరాలు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయుట, కొరిలేషన్ సవరణలు, ఆర్ఓఆర్ సమస్యలు, సివిల్ తగాదాలు, భూమి మార్పిడి – వ్యవసాయం నుండి వ్యవసాయేతర అంశాలు సమర్పించాలన్నారు.
నాలుగవ కౌంటర్లో రీసర్వే సమస్యలు, సర్వే సబ్ డివిజన్ మరియు ఎఫ్ లైన్ హద్దులకు, ఇతర సర్వే సమస్యలకు సంబంధించిన అంశాలు సమర్పించాలని తెలిపారు.
మీకోసం వెబ్ సైట్ లో ఆర్జీలు సమర్పించవచ్చు
ప్రజలు తమ సమస్యలను మీకోసం వెబ్ సైట్ లోను అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ చెప్పారు. అర్జీల వివరాలు
Meekosam.ap.gov.in
(మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. పి.జి.ఆర్.ఎస్ ను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. పి.జి.ఆర్.ఎస్ లో సమర్పించిన అర్జీల స్థితిని 1100 టోల్ ఫ్రీ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. అర్జీలను మీకోసం వెబ్ సైట్ లోను సమర్పించవచ్చని చెప్పారు.
Prajavartha Online Telugu News