-వైసీపీ హయాంలో పల్నాడులో రక్తం ఏరులై పారింది
-టీడీపీ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయి
-వ్యక్తుల ఘర్షణకు రాజకీయ రంగు పులిమేందుకు వైసీపీ కుట్రలు
-కుట్ర పూరిత రాజకీయాల ఫలితమే వైసీపీ 11 సీట్లు
-పల్నాడు ప్రశాంతతకు ఎవరు భంగం కలిగించినా ఉపేక్షించేది లేదు
-పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పల్నాడు ప్రాంతంలో వైసీపీ హయాంలో రక్తం ఏరులై పారితే కూటమి ప్రభుత్వ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయని పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణకు రాజకీయ రంగు పులిమి తెలుగుదేశం పార్టీపై బురద చల్లేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండి పడ్డారు. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కి జగన్ నేతృత్వంలోని వైసీపీ కి మధ్య ఉన్న తేడా ప్రజలకు బాగా తెలుసని అన్నారు. అరాచకాలతో గందరగోళం చేసే పార్టీ వైసీపీ అని ఆరోపించారు. కానీ టీడీపీ అలా కాదన్నారు. గ్రామాల అభివృద్దే ధ్యేయంగా పని చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నందుకే ఆ పార్టీని ప్రజలు 11సీట్లకు పరిమితం చేశారన్నారు. అయినా కూడా వైసీపీకి బుద్ది రాలేదని విమర్శించారు. పల్నాడు ఫ్యాక్షన్, హత్యా రాజకీయాలపై వైసీపీ నేతలు చేస్తున్నఅసత్య ప్రచారాన్ని ఖండిస్తూ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి లోని క్యాంప్ కార్యాలయం నుంచి ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఫ్యాక్షన్, అక్రమ మైనింగ్ లతో పల్నాడు ప్రాంతం వల్లకాడు అయ్యిందని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. గురజాల నియోజకవర్గం, మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామానికి చెందిన 300 మంది ఊరు వదిలి భయంతో పారిపోయారని అన్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో పిన్నెల్లి గ్రామంలోనే 12 మందిని చంపేశారని, అందులో ఎస్సీ, బీసీలు కూడా ఉన్నారని మంత్రి గొట్టిపాటి ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ తో ఏర్పడిన గుంటల్లో పడి ఏడెనిమిది మంది చనిపోయినా పట్టించుకున్న వాళ్లు లేరని విమర్శించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై జరిగిన దాడులు, హత్యా రాజకీయాలు, పల్నాడు ప్రాంతంలో చేసిన గందరగోళాలు అందరికీ తెలుసని మంత్రి గొట్టిపాటి చెప్పారు. బాధితులను పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు పల్నాడుకు వెళ్తే అడ్డుకునే ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా మంత్రి గొట్టిపాటి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గతంలో ఊరు విడిచి వెళ్లిన వాళ్లందరు తిరిగి ఊళ్లకు వస్తున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పల్నాడు ప్రాంత రైతుల వ్యవసాయ భూములకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగునీటి సరఫరా చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. టీడీపీ, చంద్రబాబు ఎలాంటి వారో అందరికీ తెలుసని ఈ విషయాలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయన్నారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని మొదటి నుంచి సీఎం చంద్రబాబు చెబుతుంటారని మంత్రి గొట్టిపాటి తెలిపారు. ప్రజలందరూ సుఖ, శాంతులతో ఉండాలన్న ఏకైక ధ్యేయంతో., గత 40 సంవత్సరాలుగా చంద్రబాబు పని చేస్తున్నారన్నారు.
అక్రమ సంపాదన నుంచి పుట్టిందే వైసీపీ…
జగన్ అధికారం చేపట్టిన తరువాత నుంచి పల్నాడుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా హత్యా రాజకీయాలు జరిగాయో ప్రజలు కూడా గమనించాలని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. టీడీపీ నేతలపై దాడులు చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు బనాయించి జైలుకు కూడా పంపారన్నారు. అక్రమంగా సంపాదించిన సొమ్ములతో వైసీపీ పార్టీని పెట్టారని మంత్రి ఆరోపించారు. తెలుగోడి ఆత్మ గౌరవం కోసం పుట్టిందే తెలుగుదేశం పార్టీ అన్నారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చినా ఇంకా వైసీపీ నేతలకు సిగ్గు రాలేదని మంత్రి గొట్టిపాటి విమర్శించారు. గ్రామాల్లో జరిగిన హత్యలకు రాజకీయ రంగు పూసి, ఎవరు చనిపోతారా.. లబ్ధి పొందుదామని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మంత్రి మండి పడ్డారు. వైసీపీ నేతల అనైతిక చర్యలను ప్రజలు కూడా ఖండించాలని మంత్రి గొట్టిపాటి కోరారు.
ఫ్యాక్షన్ లేని పల్నాడుకు కృషి చేస్తున్నాం….
రాష్ట్రంలో హత్యా రాజకీయాలు, ఫ్యాక్షన్ గొడవలు ఎక్కడ జరిగినా అణచి వేసింది చంద్రబాబు నాయుడు ఒక్కరే అని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పల్నాడు ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉందన్నారు. ఈ ప్రశాంతతను భగ్నం చేయడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తే చూస్తూ ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడ హత్యా రాజకీయాలు జరిగినా కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుందన్నారు. ప్రశాంత వాతావరణంలో ప్రతి రైతు కుటుంబంలోనూ ఒక ఉద్యోగం ఉండాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. ఫ్యాక్షన్ గొడవల పట్ల పోలీస్ శాఖ కూడా కఠిన వైఖరి అవలంబిస్తుందన్నారు. బాధితులకు అండగా ఉంటూనే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గొట్టిపాటి హెచ్చరించారు.
Prajavartha Online Telugu News