-రోడ్డు ప్రమాద క్షతగాత్రుల వైద్యానికి మొదటి గంట – గోల్డెన్ అవర్
-జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్డు ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందకపోవడం వల్లన అనేక మరణిస్తున్నారని ప్రమాదం జరిగిన మొదటి గంట ఎంతో అమూల్య మైందని ఆసమయం లో సరైన చికిత్స అందించ గా లూ గలిగితే దాదాపు గా మరణాలను నివారించవచ్చని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ అన్నారు. విజయవాడ బందర్ రోడ్డులోని జిల్లా కలెక్ట్రేట్ గల జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా రవాణా శాఖ అధికారులు రూపొందించిన గుడ్ సమరిటన్ పోస్టర్‌ను జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి ఎస్. ఇలక్కియ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి ఎస్. ఇలక్కియ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి మొదటి గంట చాలా కీలకమైన సమయమని, దీనినే గోల్డెన్ అవర్ గా పరిగణించాలన్నారు .ఈ మొదటి గంటలో సరైన వైద్యం అందించినట్లయితే, ప్రాణాలు కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని బాధితులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని ఆమె అన్నారు. ప్రమాదాలకు గురైన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు చాలా మంది భయపడుతున్నారని, కేసుల్లో ఇరుక్కుంటామేమోనని ఆందోళన చెందుతున్నారని, కానీ అలాంటి భయం అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రహవీర్ చట్టం తీసుకువచ్చిందని, మోటారు వాహనాల చట్టం సెక్షన్ 134 (A) ప్రకారం రహవీర్ (గుడ్ సమరిటన్) లకు రక్షణ కల్పించబడుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాద సమాచారాన్ని ఫోన్ ద్వారా పోలీసులకు లేదా అత్యవసర సర్వీసులకు తెలియజేసిన వారు, క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించిన వారు, తమ పేరు లేదా వ్యక్తిగత సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎవరూ వత్తిడి చేయరని ఆమె చెప్పారు. ప్రమాద బాధితులను ఆసుపత్రిలో చేర్పించి వెళ్లిపోవచ్చని తెలిపారు. గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రిలో చేర్పించిన రహవీర్ (గుడ్ సమరిటన్) లకు ప్రభుత్వం ప్రోత్సాహక బహుమతిగా రూ. 25,000/- అందజేస్తుందని అన్నారు. ప్రమాద బాధితులకు తమ వంతు బాధ్యతగా సహాయం అందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కె. బాలకృష్ణ, ఆర్డీఓ నందిగామ, కె. మాధురి ఆర్డీఓ తిరువూరు, ఆర్టీఓ కె. వెంకటేశ్వరరావు, మోటార్ వెహికల్ తనిఖీ అధికారులు ఎ. ఉదయ శివ ప్రసాద్, డివి రమణ, మహమ్మద్ అలీ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News