-న్యాయవాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
– జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వ విధానాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడంలో భాగంగా 40 గంటల మధ్యవర్తిత్వ శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో సుప్రీం కోర్టు మధ్యవర్తిత్వం మరియు రాజీ ప్రాజెక్టు కమిటీ (MCPC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మధ్యవర్తిత్వ శిక్షణా కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సివిల్ ప్రొసీజర్ కోడ్–89 ప్రకారం వివాదాలను నాలుగు ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా పరిష్కరించే అవకాశం ఉందని, వాటిలో మధ్యవర్తిత్వం ఒక ముఖ్యమైన విధానమని పేర్కొన్నారు. న్యాయాధికారులు ఒక కేసు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కార సాధ్యం అవుతుందని నిర్ధారించినప్పుడు, ఆ కేసులను మధ్యవర్తిత్వ కేంద్రానికి సిఫారసు చేయడం జరుగుతుందని గంధం సునీత తెలిపారు. నియమ నిబంధనల ప్రకారం జ్యుడీషియల్ అధికారి లేదా న్యాయవాదిని మధ్యవర్తిగా నియమించి, తదుపరి సమస్యలు తలెత్తకుండా సహేతుకమైన పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. లోక్ అదాలత్ ద్వారా సివిల్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, భూసేకరణ కేసులు, ఎగ్జిక్యూటివ్ కేసులు, మోటార్ వాహన ప్రమాదాలకు సంబంధించిన MVOP కేసులు పరిష్కారానికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ విధంగా కేసులు పరిష్కారమైతే కోర్టు ఫీజు కూడా తిరిగి లభిస్తుందని చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమైన కేసులపై తిరిగి అప్పీల్‌కు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. దీనివల్ల కోర్టులపై 25 నుండి 50 శాతం వరకు భారం తగ్గే అవకాశం ఉందని తెలిపారు. నిజమైన కేసులను మాత్రమే మధ్యవర్తిత్వానికి తీసుకురావాలని, శిక్షణ పొందిన బృందానికి ఆయా కేసులు రిఫర్ చేయడం జరుగుతుందని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యంగా, సమరసతతో వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఒక చక్కటి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం 19-01-2026 నుండి 23-01-2026 వరకు “మధ్యవర్తిత్వం యొక్క భావన & సాంకేతికతలు” అంశంపై తూర్పు గోదావరి జిల్లా న్యాయవాదుల కోసం, రాజమహేంద్రవరంలోని జిల్లా న్యాయ సేవల అథారిటీ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. లక్ష్మీ, మీడియేషన్ మాస్టర్ ట్రైనర్ (డిల్లీ) ఎస్. హెచ్. సురేందర్ సింగ్, మీడియేషన్ మాస్టర్ ట్రైనర్ (కేరళ) పి. ఎం. మొహమ్మద్ షిరాజ్ , ఇతర న్యాయ మూర్తులు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 35 మంది న్యాయవాదులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News