తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రహదారి భద్రత మాసో త్సవాల్లో భాగంగా తిరుపతి నగరంలోని BIRRD (బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్) హాస్పిటల్‌లో డైరెక్టర్ శ్రీ జగదీష్ గారి ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులు రహదారి భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాయలసీమ జోన్ ప్రాంతీయ సంయుక్త రవాణా కమిషనర్ శ్రీమతి డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలో అత్యవసర ట్రామా కేర్ ఇన్‌స్టిట్యూట్‌ను పూర్తి సిబ్బందితో స్థాపించాల్సిన అవసరం గురించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు.జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ మాట్లాడుతూ జిల్లాలో 1196 ప్రమాదాలు జరిగాయని తద్వారా 540 మంది మరణించారని 1485 మంది క్షతగాత్రులయ్యారని తెలియజేశారు.
ప్రమాదాల పునరావాసం, ట్రామా కేర్ మరియు పాలియేటివ్ కేర్ రంగాల్లో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఆసుపత్రి యాజమాన్యానికి ఎంతైనా ఉందని తెలియజేశారు.
హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకా రెడ్డి మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ సంస్థగా వైద్య సహాయ చర్యలను పలు రకాలుగా చేపడుతున్నట్లు, ట్రామా కేర్, వికలాంగులు, రోడ్డు ప్రమాద బాధితుల కోసం పాలియేటివ్ కేర్ రంగాల్లోని కీలక కార్యక్రమాల గురించి వివరించారు. అత్యవసర వైద్య సేవలు, పునరావాసం, దీర్ఘకాల సంరక్షణకు సంబంధించిన చేపట్టిన మరియు ప్రతిపాదించిన చర్యలను RMO డాక్టర్ కృష్ణమూర్తి తెలియజేశారు.
ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ కౌశిక్ మాట్లాడుతూ రహదారి భద్రత మనందరి బాధ్యత అని తెలియజేస్తూ సిబ్బంది రహదారిలో పాదాచార్యులుగా నడిచేటప్పుడు మరియు వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులందరూ రోడ్డు భద్రత మెరుగుదల, ప్రమాదాల తగ్గింపు, ప్రమాదానంతర వైద్య సంరక్షణను బలోపేతం చేయడంలో సమిష్టిగా పనిచేస్తామని ఆసుపత్రి యాజమాన్యం హామీ ఇచ్చింది.ఈ కార్యక్రమం చివరిలో పాల్గొన్న అందరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తామని, రోడ్డు భద్రతపై అవగాహన పెంచుతామని, ప్రమాద బాధితుల ప్రాణాలు రక్షించే కార్యక్రమాలకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మోటార్ వాహనాలు తనిఖీ అధికారి శ్రీనివాసరావు మరియు యోగా మాస్టర్ రాంజీ గారు రహదారి భద్రత వైద్యురాలు పూజ వాణి ఉపాధ్యాయ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News