గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరానికి కీలకమైన శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనుల్లో నగరపాలక సంస్థకు సంబంధించిన పనులను యుద్ద ప్రాతిపదినక పూర్తి చేయనున్నామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. మంగళవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తో కలిసి శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం నిర్దేశిత గడువులోగా జరిగేలా కేంద్రమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిత్యం సమీక్షిస్తున్నారన్నారు. నిర్మాణ సంస్థ పనులు చేపట్టడానికి వీలుగా సైట్ క్లియర్ చేసి ఇవ్వాల్సిన భాధ్యత జిఎంసిపై ఉన్నందున, ఆ దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. ఇప్పటికే పలుదఫాలుగా ప్రభావిత భవన యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేశామని, బుధవారం కూడా వారితో కమిషనర్ నేతృత్వంలో మరో సమావేశం నిర్వహిస్తామన్నారు.
కమిషనర్ తొలుత ఆర్ఓబి నిర్మాణ పరిధి, ఎన్ని భవనాలు ప్రభావితం అవుతున్నదీ, ఇప్పటి వరకు తొలగించినవి, కోర్ట్ కేసులు తదితర అంశాలను సమగ్రంగా అధికారులను అడిగి తెలుసుకొని, మాట్లాడుతూ బ్రాడీపేట వైపు పెండింగ్ లో ఉన్న పిల్లర్లలో ఒక పిల్లర్ నిర్మాణంకు సైట్ క్లియర్ గా ఉన్నందున పనులు చేపట్టవచ్చన్నారు. అంగీకారం తెలిపిన భవనాలను తక్షణం తొలగించాలని, తెలపని వారితో మరోమారు వారి సమస్యలు, అనుమానాలను తెలుసుకొని, జిఎంసి నుండి తీసుకోవాల్సిన పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. ఆర్ఓబి పనులు పూర్తయ్యే వరకు జిఎంసి పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం ఈ నెలలో జిజీహెచ్ లో నూతన భవన ప్రారంభానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్న నేపధ్యంలో, పర్యటన మార్గంలో ప్రత్యేక పారిశుధ్య పనులు, ఆక్రమణల తొలగింపు, రోడ్లపై ప్యాచ్ వర్క్ ల మరమత్తు చేపట్టాలని ఆయా అధికారులను ఆదేశించారు.
పర్యటనలో సిటి ప్లానర్ రాంబాబు, ఎస్ఈ వెంకటేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య , ఈఈ వేణుగోపాల్, డిసిపి సూరజ్ కుమార్, ఎసిపి రెహ్మాన్, కార్పొరేటర్ వరప్రసాద్, ప్రజారోగ్య, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News