-పైప్‌లైన్ భద్రత, అత్యవసర చర్యలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం
-మిథున్ కుమార్ శీలం, చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) పరిధిలోనిపారదీప్–హైదరాబాద్ పైప్‌లైన్ (PHPL) – రాజమహేంద్రవరం యూనిట్ ఆధ్వర్యంలో లెవల్–III ఆఫ్‌సైట్ ఎమర్జెన్సీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆగ్నేయ ప్రాంత పైప్‌లైన్స్
చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ మిథున్ కుమార్ శీలం తెలిపారు. ఈ మాక్ డ్రిల్‌ను తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం మండలం, సీతానగరం గ్రామ పరిధిలో ఉన్న PHPL చైనేజ్ నం. 834.9 కి.మీ. వద్ద జనవరి 22, 2026 (గురువారం) న ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పైప్‌లైన్ భద్రత, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, ప్రజల భద్రతపై అవగాహన పెంపొందించడమే ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశ్యమని మిథున్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, వైద్య తదితర విభాగాల అధికారులు పాల్గొని, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే విధానాలను ప్రదర్శించనున్నారని తెలిపారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా విపత్తు నిర్వహణలో ముందస్తు సన్నద్ధతను పరీక్షించడంతో పాటు, లోపాలను గుర్తించి భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన చర్యలు చేపట్టేందుకు ఇది దోహదపడుతుందని ఆయన అన్నారు. ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురికావద్దని, ఇది పూర్తిగా సాధన (మాక్ డ్రిల్) కార్యక్రమమేనని ఆయన స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News