-కేంద్ర సమాచార ప్రసార, మత్స్య, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్
-మత్స్యకారులు, మత్స్య రంగ అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది
-నెల్లూరులో మినీ చేపల విక్రయ కేంద్రాలను ప్రారంభించిన మంత్రి
నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర సమాచార ప్రసార, మత్స్య, పాడి పరిశ్రమ, పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈరోజు నెల్లూరులో పర్యటించారు. వివిధ కార్యకమాల్లో పాల్గొని ప్రసంగించిన మంత్రి దేశంలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పిన అయిదు ప్రత్యేకమైన ఫిషింగ్ హార్బర్లలో ఒకటి విశాఖపట్నంలో ఏర్పాటు అయ్యిందని తెలిపారు. దేశంలో సముద్ర ఆహార రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.
మంత్రి పదవి చేపట్టిన తరువాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన డాక్టర్ మురుగన్ నెల్లూరు లో మత్స్యకారుల సంఘం ప్రతినిధులతో సమావేశం అయ్యారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించారు. మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇందులో భాగంగా మత్స్యకారుల సంక్షేమం కోసం తొలిసారిగా శ్రీ మోదీ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసారని వివరించారు. మత్స్యకారుల, మత్స్య రంగ సంక్షేమం, అభివృద్ధి కోసం రూ. 20,500 కోట్లతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్నికేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా సీ వీడ్ పార్కును ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు.
మత్స్యకార కుటుంబాల సంప్రదాయాలను పరిరక్షించడానికి ప్రభుత్వం అన్ని చర్యలను అమలు చేస్తుందని డాక్టర్ మురుగన్ హామీ ఇచ్చారు. సహజ వనరులను పరిరక్షిస్తూ మత్స్యకారుల ఆదాయాన్ని ఎక్కువ చేయాలన్న లక్ష్యంతో వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘ మత్స్యకారుల సంక్షేమం, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెడుతుందని, సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ఈ బిల్లును రూపొందిస్తాము’ అని మంత్రి అన్నారు.
నెల్లూరులో జయభారత్ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి రోగుల యోగక్షేమాలను విచారించి వారికి పళ్ళు అందించారు. డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బందితో ఆయన మాట్లాడుతూ ప్రజా సేవలో అంకిత భావంతో పనిచేస్తున్నారని వారిని ప్రసంసించారు.
దేశ ప్రజల సంక్షేమం, దేశాభివృద్ధి కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎంతో సేవా దృక్పధంతో పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు. మోదీ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని తామందరూ పనిచేస్తున్నట్లు తెలిపారు.
నెల్లూరు సమీపంలోని కొత్త కోడూరులో రొయ్యల బయోఫ్లోక్ యూనిట్ను సందర్శించిన మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రొయ్యలు, మత్స్య రంగంలో అమలు చేస్తున్న చర్యలను అధికారులు మంత్రికి వివరించారు. రొయ్యల బయోఫ్లోక్ యూనిట్ల సంయుక్త కంట్రోల్ రూమ్ని సందర్శించి దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు.
ధనలక్ష్మీపురంలో పనిచేస్తున్న భారత ప్రభుత్వ మత్స్య శాఖ ‘ఫిష్ ఆంధ్రా’ విక్రయ కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కొబ్బరి మొక్కను నాటారు.
అంతకుముందు, డాక్టర్ మురుగన్ 18 సంవత్సరాల మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వారికి కోవిడ్ 2 వ డోసు టీకా పంపిణీ ఇవ్వడానికి స్వర్ణ భారత్ ట్రస్ట్, వెంకటాచలం వారు నిర్వహించిన శిబిరాన్ని ప్రారంభించారు.