– ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలన్నీ నిరంతరం సక్రమంగా పనిచేసేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అదే విధంగా సంక్షేమ వసతి గృహాలలో మెరుగైన వసతులు కల్పన, ప్రజల సంతృప్తి స్థాయి పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఆదేశించినట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. గురువారం సాయంత్రం అమరావతిలోని ఏపీ సచివాలయం నుంచి సీసీటీవీలు, పౌర సేవలు, సంక్షేమ వసతి గృహాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రజల భద్రత దృష్ట్యా సీసీటీవీలను *రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (RTGS)*తో అనుసంధానించి నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని తెలిపారు. పనిచేయని కెమెరాలను వెంటనే మరమ్మతులు చేయాలని, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, అలాగే CSR నిధులతో ఏర్పాటు చేసిన సీసీటీవీలను కూడా పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని ప్రధాన కార్యదర్శి సూచించినట్లు తెలిపారు.
ప్రధాన కార్యదర్శి సూచనల మేరకు జిల్లాలో క్షేత్ర స్థాయిలో తగిన చర్యలు తీసుకుంటామని, ఇందులో భాగంగా పోలీసు, మున్సిపల్ శాఖ లతో సమన్వయం చేసుకుంటున్నట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలియ చేశారు. నేరాలు తగ్గుదల, ప్రజల భద్రత నేపథ్యంగా జిల్లాలో సీసీటీవీలు సక్రమంగా పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగ్గా ఉండేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో జిల్లా అధికారులకు, అలాగే ఎంపిడివోలకు ఆయా సంక్షేమ వసతి గృహాలను మ్యాపింగ్ చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు అందుతున్న వసతులపై సంతృప్తి స్థాయి పెరిగేలా అధికారులు, వార్డెన్లు చొరవ చూపాలని స్పష్టం చేసినట్లు తెలిపారు. అనపర్తి బీసీ సంక్షేమ వసతి గృహానికి శుద్ధమైన త్రాగునీరు అందించే అంశంపై రాష్ట్ర అధికారులకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని, ప్రజలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సంతృప్తి స్థాయి పెంచేలా అన్ని చర్యలు తీసుకుంటామని వై. మేఘా స్వరూప్ వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక కలెక్టరేట్ నుంచి ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి, సీపీవో ఎల్. అప్పల కొండ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.ఎన్. జ్యోతి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి. శశాంక, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎండీ ఘయాజుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News