-ఏపీలో 7 ప్రధాన సిమ్‌బాక్స్ (SIMBOX) కేంద్రాల ధ్వంసం; AI సహాయంతో 17.27 లక్షల అనుమానాస్పద మొబైల్ కనెక్షన్ల తొలగింపు జరిగింది.
-ప్రతి ఒక్కరూ సంచార్ సాథి యాప్ ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవటం మంచిది. ఈ యాప్ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించదు – అదనపు డైరెక్టర్ జనరల్ (టెలికాం) ఏపీ & టీజీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పౌరుల డిజిటల్ భద్రతను బలోపేతం చేయడం, నెట్‌వర్క్ నాణ్యతను పెంచడం, మారుమూల ప్రాంతాలకు టెలికాం సేవలను విస్తరించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ అదనపు డైరెక్టర్ జనరల్ (టెలికాం) మోనికొండ నగేష్ రావు, ITS తెలిపారు. ఈరోజు విజయవాడలోని టెలికమ్యూనికేషన్ల విభాగం (DoT), విజయవాడ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ విభాగ పనితీరు, పౌర కేంద్రీకృత సేవల గురించి వివిధ అంశాలు పంచుకున్నారు. .
సంచార్ సాథి – పౌర సేవల్లో విప్లవం:
పౌరుల కోసం ప్రవేశపెట్టిన ‘సంచార్ సాథి’ పోర్టల్ అద్భుత ఫలితాలను ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా CEIR మాడ్యూల్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 46,488 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడమే కాకుండా, ‘నో యువర్ మొబైల్’ (KYM) సేవ ద్వారా ఏపీ, తెలంగాణల్లో 23.65 లక్షల అనధికారిక మొబైల్ నంబర్ల ఫిర్యాదులను పరిష్కరించినట్లు వెల్లడించారు.
సంచార్జ్ సాథీ యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని వినియోగించాలని సూచించారు. ఈ యాప్ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించదని చెప్పిన ఆయన.. సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా చేసే మోసాలకు అడ్డుకట్ట వేసి పౌరుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారానికి రక్షణగా నిలుస్తుందని తెలిపారు. అలాగే.. డిజిటల్ మోసాలను అరికట్టడానికి DoT కి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం (AIDIU) నిరంతరం నిఘా ఉంచుతోందని నాగేష్ రావు తెలిపారు. అంతర్జాతీయ కాల్‌లను భారతీయ నంబర్లుగా మార్చి మోసం చేస్తున్న 7 సిమ్‌బాక్స్ (SIMBOX) ముఠాలను ఏపీలో గుర్తించి, ధ్వంసం చేశామని తెలిపారు. దీంతో వ్యక్తిగత వివరాల అపహరణ, ఆర్థిక మోసాలను నిలువరించగలిగినట్లు తెలిపారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 36.49 లక్షల అనుమానాస్పద నంబర్లను గుర్తించి, అందులో 17.27 లక్షల కనెక్షన్లను తొలగించామని, నిబంధనలు ఉల్లంఘించిన 63 మంది రిటైలర్లపై పోలీస్ కేసులు నమోదు చేశామని చెప్పారు. అదనంగా, 41 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (FRI) తో అనుసంధానించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 30,000 టవర్లు సేవలు అందిస్తున్నాయని, 1600 టవర్లకు నిర్వహించిన రేడియేషన్ ఆడిట్‌లో అన్నీ సురక్షిత ప్రమాణాల లోపే ఉన్నాయని నిర్ధారించారు. డిజిటల్ భారత్ నిధి కింద మారుమూల, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 2246 గ్రామాలకు 1232 టవర్ల ద్వారా 4G కనెక్టివిటీ అందించామన్నారు. ‘సమృద్ధి గ్రామ పంచాయతీ’ ప్రాజెక్ట్ కింద 172 గ్రామాల్లో ప్రతి ఇంటికి హై-స్పీడ్ ఫైబర్ కనెక్షన్లు ఇస్తున్నట్లు వివరించారు. ఇటీవల సంభవించిన ‘మోంతా’ తుఫాను సమయంలో టెలికాం నెట్‌వర్క్ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి 24 గంటల్లోనే 99% సేవలను పునరుద్ధరించగలిగామని అన్నారు. అలాగే ‘సంచార్ మిత్ర 2.0’ ద్వారా విద్యార్థులు, ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నారని నాగేష్ రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News